Arvind Kejriwal : దేశ రాజకీయాల్లో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు ముగ్గురు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్.. ముగ్గురూ శుక్రవారం బీజేపీలో చేరారు. మొత్తం పది మంది రాజ్యసభ ఎంపీల్లో ఈ ముగ్గురితో కలిసి మొత్తం ఏడుగురు పార్టీని వీడారు. అంటే.. మూడింట రెండొంతలు. దీంతో వీరు బీజేపీలో విలీనమైనట్లే. మరో ముగ్గురు ఎంపీలు మాత్రమే ఇప్పుడు రాజ్యసభలో ఆప్‌తో ఉన్నారు. రాఘవ్ చద్దా సహా ఆప్ ఎంపీలు పార్టీని వీడటంపై ఆప్ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు.
పంజాబ్ ప్రజలకు బీజేపీ మరోసారి వెన్నుపోటు పొడిచిందని ఆయన వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా వేదికగా కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు. పార్టీ నుంచి నేతలు వెళ్లిపోయినప్పటికీ.. ఆప్ ఎప్పుడూ ఐక్యంగానే ఉంటుందని పంజాబ్ సీఎం భగవంత్ మన్ అన్నారు. ఆప్ మరో ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఈ అంశంపై మాట్లాడారు. ‘‘రాఘవ్ చద్దాకు పార్టీ అన్నీ ఇచ్చింది. ఎంపీ, ఎమ్మెల్యేను చేసింది. సందీప్ పాఠక్‌ను పంజాబ్ ప్రజలు ప్రేమతో రాజ్యసభకు పంపారు. దిగువస్థాయి నుంచి వచ్చిన రాజేంద్ర గుప్తా, అశోక్ మిట్టల్, స్వాతి మాలివాల్, విక్రమ్ సాహ్నీలకు పంజాబ్ ప్రజలు, పార్టీ ఉన్నత అవకాశాలు కల్పించింది. ప్రజల ఆశీస్సుల వల్లే హర్భజన్ సింగ్‌కు రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం దక్కింది. కానీ, ఈ ఏడుగురూ పార్టీకి, రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. బీజేపీ.. ఆపరేషన్ లోటస్‌ను మళ్లీ మొదలుపెట్టింది. మా పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలను ప్రలోభపెట్టడానికి ఈడీ, సీబీఐలను బీజేపీ వాడుకుంది’’ అని సంజయ్ సింగ్ విమర్శించారు. మొత్తం పది మంది రాజ్యసభ సభ్యుల్లో ఇప్పుడు ఆమ్ ఆద్మీకి సంజయ్ సింగ్ (ఢిల్లీ), నారాయణ్ దాస్ గుప్తా (ఢిల్లీ), బల్బీర్ సింగ్ సీచేవాల్ (పంజాబ్) మాత్రమే మిగిలారు.
బీజేపీలో చేరిన ఆప్ నేతలు
శుక్రవారం మధ్యాహ్నం ఆమ్ ఆద్మీకి రాజీనామా చేసిన రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్.. అనంతరం బీజేపీలో చేరారు. న్యూఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. దీంతో ఆప్ రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనం అయినట్లైంది. అయితే, దీనిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఈ ముగ్గురూ బీజేపీలో చేరడంపై రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేసేందుకు ఆప్ సిద్ధమైంది.