KTR | హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : కార్టూనిస్ట్ శేఖర్ స్మారక అవార్డులు కళాకారులకు స్ఫూర్తినిస్తాయని, తెలంగాణ ఉద్యమ సమయంలో శేఖర్ కార్టూన్లు ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కళలను ప్రోత్సహించడం సామాజిక బాధ్యత అని చెప్పారు.
ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ స్మారకార్థం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆదివారం నిర్వహించిన ‘కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డ్స్- 2026’ ప్రదానోత్సవంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఏడాది కార్టూన్ విభాగంలో కార్టూనిస్ట్ ఎం నారు, ఆర్టిస్టు విభాగంలో చిత్రకారుడు కూరెళ్ల శ్రీనివాస్ ఎంపిక కాగా వారికి కేటీఆర్ పురసారాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ జీవితంలో ప్రతిరోజూ విమర్శలు, ప్రతి విమర్శల మధ్య గడుపుతున్న తమకు ఇలాంటి ఆహ్లాదకరమైన సాహిత్య, కళా వేదికల్లో పాల్గొనడం సంతోషాన్నిస్తుందని పేర్కొన్నారు.
కళాకారులు, రచయితలు, కవులు, చిత్రకారులతో మమేకమయ్యే అవకాశాలు అరుదుగా వస్తాయని, అలాంటి సందర్భాలు పాత జ్ఞాపకాలను, ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేస్తాయని చెప్పారు. ‘ఒక చిత్రం వెయ్యి పదాలతో సమానం’ అనే సూక్తిని ప్రస్తావిస్తూ సమాజం, రాజకీయాలపై కార్టూన్లు చూపే ప్రభావం ఎంతో గొప్పదని తెలిపారు. దేశంలో ఆర్కే లక్ష్మణ్ వంటి మహోన్నత కార్టూనిస్టులు చూపిన మార్గం చిరస్మరణీయమని, అంతర్జాతీయంగా బిల్ వాటర్సన్ సృష్టించిన ‘క్యాల్విన్ అండ్ హాబ్స్’ తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. తెలుగులో ఈనాడు శ్రీధర్, సాక్షి శంకర్ వంటి కార్టూనిస్టుల ప్రతిభను కేటీఆర్ ప్రశంసించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో మహాత్మా గాంధీ విలువలు, ఆయన చూపిన సిద్ధాంతాల అవసరం దేశానికి మరింత పెరిగిందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మత విశ్వాసాలు ప్రతి వ్యక్తికీ వ్యక్తిగతమైనవేనని, పరస్పర గౌరవంతో ముందుకు సాగడం సమాజానికి అవసరమని పేరొన్నారు. జీవితంలో గెలుపు, ఓటములు సహజమని, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు మేలు చేయడమే ప్రజాప్రతినిధుల కర్తవ్యమని స్పష్టంచేశారు. కళలను ప్రోత్సహించేందుకు ఇలాంటి అవార్డులు తప్పనిసరి అని పేరొంటూ, ప్రతిభావంతులైన యువ కళాకారులను గుర్తించి ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని చెప్పారు.
శేఖర్‌ను వ్యక్తిగతంగా కలిసే అవకాశం రాకపోయినా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లోనూ తెలంగాణ బిల్లు ఆమోదమైన రోజున గన్‌పార్కు వెళ్లి తెలంగాణ సాధనను చూసి ఆనందించిన ఘటన తనను ఎంతో కదిలించిందని గుర్తు చేసుకున్నారు. జూన్ 2, 2014కు ముందే ఆయన మరణించడం దురదృష్టకరమని వాపోయారు. కార్టూనిస్ట్ ఎం నారు, చిత్రకారుడు కూరెళ్ల శ్రీనివాస్‌కు మెమొంటోతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా డాక్టర్ ఎస్ రఘు వ్యవహరించారు. ప్రొఫెసర్ బెల్లి యాదయ్య స్మారకోపన్యాసం చేశారు. విజ్ఞానదర్శిని వ్యవస్థాపకుడు రమేశ్, సాక్షి కార్టూనిస్ట్ శంకర్, ఓటా మీడియా సీఈవో కంభాలపల్లి కృష్ణ, చంద్రకళా శేఖర్, పలువురు రచయితలు, శేఖర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
వచ్చే ఏడాది నుంచి శేఖర్ మెమోరియల్ అవార్డులను మరింత ఘనంగా నిర్వహించేందుకు తనవంతు సహకారం అందిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రెస్‌క్లబ్‌కు బదులుగా రవీంద్రభారతిలో మరింత వైభవంగా కార్యక్రమం నిర్వహించేలా అండగా ఉంటానని తెలిపారు. కళాకారులు, రచయితలు సమాజానికి అందిస్తున్న సేవలను ఎల్లప్పుడూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు. శేఖర్ కుటుంబ సభ్యులు, మిత్రులు ఆరేండ్లుగా ఆయన స్మారకార్థం అవార్డులు అందించడం అభినందనీయమని ప్రశంసించారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు కార్టూనిస్టుగా శేఖర్ విశిష్ట సేవలు అందించారని, సమకాలీన అంశాలపై ఆయన వేసిన కార్టూన్లు ప్రత్యేక గుర్తింపు పొందాయని గుర్తుచేశారు.