న్యూఢిల్లీ, జనవరి 18: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్‌పై శనివారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి యత్నించారు. ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై తీవ్రంగా స్పందించిన ఆప్..ఇదంతా బీజేపీ కుట్రేనని ఆరోపించింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న తరుణంలో..కేజ్రీవాల్ ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. అదే సమయంలో దుండగులు ఆయన కాన్వాయ్‌లోని ఓ కారుపై రాళ్లు రువ్వారు. ఘటనపై బీజేపీ స్పందిస్తూ, ‘కేజ్రీవాల్ కాన్వాయ్ ఇద్దరు వ్యక్తులను ఢీ కొట్టింది. ఆ ఇద్దరినీ దవాఖానకు తరలించారు. ముందున్న ఓటమి గురించి ఆలోచిస్తూ, ప్రజల ప్రాణాలకున్న విలువను ఆయన మరిచిపోయారు. బాధితులను కలిసేందుకు దవాఖానకు వెళ్తున్నా’ అని బీజేపీ నేత పర్వేశ్ వర్మ ‘ఎక్స్’లో ఓ పోస్ట్ చేశారు.