న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో బీజేపీ సైద్ధాంతిక మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) లేఖ రాశారు. కొత్త ఏడాది ఆరంభమైన బుధవారం, బీజేపీ రాజకీయాలకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించారు. బీజేపీ తప్పులకు ఆర్ఎస్ఎస్ మద్దతిస్తుందా? అని కేజ్రీవాల్ నిలదీశారు. ‘బీజేపీ నేతలు బహిరంగంగా డబ్బులు పంచుతున్నారు. ఓట్లు కొనేందుకు ఆర్ఎస్ఎస్ మద్దతిస్తుందా? దళిత, పూర్వాంచల్ ప్రజల ఓటర్లను పెద్ద ఎత్తున ఓటరు జాబితాల నుంచి తొలగిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిదని ఆర్ఎస్ఎస్ భావిస్తుందా? ప్రజాస్వామ్యాన్ని బీజేపీ నిర్వీర్యం చేస్తోందా?’ అని కేజ్రీవాల్ ఆ లేఖలో ప్రశ్నించారు.
కాగా, కేజ్రీవాల్ లేఖపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ‘అబద్ధాలు, మోసం అనే మీ తప్పుడు అలవాట్లను వదిలిపెట్టి మీలో అర్థవంతమైన మార్పు తీసుకువస్తారని ఆశిస్తున్నాం’ అని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా అన్నారు. ఈ మేరకు అరవింద్ కేజ్రీవాల్‌కు తాను లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు.