Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్ట్ చేసి జైలు పాలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ఆపరేషన్ ఝాదూ చేపట్టాయని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ అరెస్ట్‌కు నిరసనగా ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఆప్ శ్రేణులు ప్రదర్శన నిర్వహించే క్రమంలో ఆప్ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాషాయ పార్టీకి దీటుగా ఆప్ ఎదగకుండా నిరోధించేందుకు బీజేపీ, ప్రధాని మోదీ కుట్రపూరితంగా ఆపరేషన్ ఝాదూను తెరపైకి తీసుకొచ్చాయని అన్నారు.
ఈ ఆపరేషన్‌లో భాగంగా ఆప్ బడా నేతలను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారని, వారిని రాబోయే రోజుల్లో అరెస్ట్ చేయడంతో ఆప్ బ్యాంక్ ఖాతాలను స్తంభింపచేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఆప్ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేస్తామని ఈడీ న్యాయవాది ఇప్పటికే కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆప్ ఖాతాలను ఇప్పుడే ఫ్రీజ్ చేస్తే ఆప్‌నకు సానుభూతి లభిస్తుందనే ఉద్దేశంతో మన ఖాతాలను లోక్‌సభ ఎన్నికల అనంతరం ఫ్రీజ్ చేసేందుకు కాషాయ పాలకులు స్కెచ్ వేశారని వివరించారు. ఎన్నికల అనంతరం మన కార్యాలయాన్ని దిగ్బంధించి మనల్ని రోడ్డు మీదకి తీసుకువస్తారని, బీజేపీ ఈ ప్రణాళికలతో ముందుకెళుతున్నదని కేజ్రీవాల్ పార్టీ శ్రేణులకు వెల్లడించారు.
మరోవైపు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) శ్రేణుల ఆందోళనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ పిలుపుమేరకు కార్యకర్తలు, నాయకులు ఆదివారం ఉదయం నుంచే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ కూడా వారితోనే ఉన్నారు.ఆప్ కార్యాలయం నుంచి ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఆప్ శ్రేణులు బయలుదేరగానే పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడ 144 సెక్షన్ ఉన్నదని, గుంపులుగా వెళ్లడానికి వీల్లేదని పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో పోలీసులకు ఆప్ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరుగుతున్నది.
Read More :
JEE Main | జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలు విడుదల.. టాప్‌లో తెలంగాణ, ఏపీ విద్యార్థులు