న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. రాజకీయ ప్రత్యర్థుల నోరు నొక్కేందుకే కేంద్రం ఈడీతో సమన్లు జారీ చేయిస్తున్నదని ఆరోపించారు. ఈడీ జారీ చేసిన సమన్లకు ఆయన బుధవారమే సమాధానమిచ్చారు. ఢిల్లీ సీఎంగా లేదా ఆప్ జాతీయ సమన్వయకర్తగా పిలిచారో సమన్లలో పేర్కొనలేదని తెలిపారు.
సమన్లను రద్దు లేదా ఉపసంహరణ లేదా తిరిగి జారీ చేయడమో చేయాలన్నారు. ‘సమన్లు హేతుబద్ధంగా లేవు. 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు సంచలన వార్తలు సృష్టించేందుకు, విపక్షాల నోరు నొక్కేందుకు కేంద్రం ఈడీతో ఈ సమన్లు జారీ చేయిస్తున్నది’ అని కేజ్రీవాల్ అన్నారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని.. సమన్లు చట్టానికి అనుగుణంగా లేవని ఆయన విమర్శించారు.