న్యూఢిల్లీ/అహ్మదాబాద్, ఆగస్టు 22: ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చి బయటకు వస్తే ఢిల్లీకి ముఖ్యమంత్రిని చేస్తామని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అంతేకాకుండా ఆయనపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులన్నీ ఎత్తివేస్తామని దూతల ద్వారా వర్తమానం పంపింది. ఈ విషయాన్ని మనీశ్ సిసోడియా ట్విట్టర్ వేదికగా సోమవారం వెల్లడించారు. నూతన మద్యం విధానంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణపై సీబీఐ ఆయనపై కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీబీఐ ఆయన ఇంటిలో సోదాలు కూడా చేసింది.
బీజేపీ ఇచ్చిన ఆఫర్‌పై సిసోడియా స్పందిస్తూ తలనైనా నరుక్కుంటాను కానీ.. కుట్రదారులు, అవినీతిపరుల ముందు తలవంచనని స్పష్టం చేశారు. ‘ఆప్‌ను వీడి బీజేపీలో చేరాలని బీజేపీ నుంచి నాకు ఓ సందేశం వచ్చింది. నాపై ఉన్న సీబీఐ, ఈడీ కేసులన్నింటినీ మూసివేయిస్తామని చెప్పారు. అయితే వారికి నేను ఒక్కటే చెప్పాను.. నేనొక రాజ్‌పుత్‌ను. మహారాణా ప్రతాప్ వారసుడిని. నా తలనైనా నరుక్కునేందుకు సిద్ధపడుతా, అంతేతప్ప కుట్రదారులు, అవినీతిపరుల ముందు తలొంచేది లేదు. నాపై ఉన్న కేసులన్నీ తప్పుడువి’ అని పేర్కొన్నారు. ‘ఏం చేయాలనుకుంటే అది చేసుకోండి’ బీజేపీని ఉద్దేశించి సిసోడియా సవాల్ చేశారు.
కాగా, బీజేపీ నేత నుంచి ఆఫర్‌కు సంబంధించిన ఆడియో రికార్డింగ్ సిసోడియా వద్ద ఉందని ఆప్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి దీన్ని విడుదల చేయాలని అనుకోవడం లేదని, అవసరమైతే ఆ ఫోన్ సంభాషణను ఆప్ విడుదల చేస్తుందని ఆప్ నేత ఒకరు పేర్కొన్నారు. అయితే సిసోడియా వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. అవినీతి ఆరోపణల నుంచి దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆఫర్ చేసిన వ్యక్తి ఎవరో చెప్పాలని ఈశాన్య ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ డిమాండ్ చేశారు.
బీజేపీ నుంచి రెండు ఆఫర్లు..
మరోవైపు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సిసోడియా గుజరాత్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ.. బీజేపీ నుంచి రెండు ఆఫర్లు వచ్చాయని తెలిపారు. ఆప్‌ను చీలిస్తే సీబీఐ, ఈడీ కేసులను వెనక్కు తీసుకోవడంతో పాటు సీఎం కుర్చీలో కూర్చోబెడుతామని ఆ దూత చెప్పారని పేర్కొన్నారు. అయితే కేజ్రీవాల్ తనకు రాజకీయ గురువు అని, సీఎం లేదా పీఎం అవడం కోసమో నేను రాజకీయాల్లోకి రాలేదని వారికి స్పష్టమైన సమాధానం ఇచ్చానని వెల్లడించారు. బెంగాల్లో సువేందు అధికారిని సంప్రదించిన వ్యక్తే ఇప్పుడు తమ నేత సిసోడియా వద్దకు ఆఫర్ తెచ్చారని ఆప్ నేత అతిశి మర్లేనా పేర్కొన్నారు.
ఇతర రాష్ర్టాల్లో చేసినట్టుగా కుట్రలు
సిసోడియా ‘ఆఫర్’ వ్యాఖ్యలపై కేజ్రీవాల్ స్పందించారు. ఇతర రాష్ర్టాల్లో చేసినట్టుగా తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సీబీఐ, ఈడీ దాడులతో బీజేపీ కుట్రలు పన్నుతున్నదని అన్నారు. అయితే రాజధాని ఢిల్లీలో వారి ‘ఆపరేషన్ కమలం’ విఫలమైందని ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా, అహ్మదాబాద్‌లో మీడియా సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ ఢిల్లీ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చిన సిసోడియా భారతరత్నకు అర్హుడని, అయితే రాజకీయ కారణాలతో ఆయన్ను కేంద్రం వేధిస్తున్నదని అన్నారు.
ప్రస్తుత రాజకీయ పార్టీలు గత 70 ఏండ్లలో చేయలేని పనని ఐదేండ్లలో అద్భుతంగా చేసిన వ్యక్తిపై సీబీఐతో దాడులు చేయించడం సిగ్గుచేటు అని కేజ్రీవాల్ కేంద్రం తీరును ఎండగట్టారు. గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సిసోడియాతో పాటు తనను కూడా అరెస్టు చేస్తారేమో? ఎవరికి తెలుసు? అని అన్నారు. బీజేపీ 27 ఏండ్ల పాలనలో గుజరాత్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో ఆప్ అధికారంలోకి వస్తే ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.