Haryana Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. కాషాయ పాలకులు అవినీతి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని ప్రజలకు అందించడం మినహా ప్రజల మేలు కోసం చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ఈసారి హరియాణ ప్రజలు మార్పు కోరుతున్నారని చెప్పారు. కేజ్రీవాల్ శుక్రవారం యమునానగర్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
హరియాణలో ఏ ప్రభుత్వం కొలువుతీరినా ఆప్ మద్దతుతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఆప్ పలు స్ధానాలను చేజిక్కించుకుంటుందని, తమ పార్టీ తోడ్పాటు లేకుండా ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాని పరిస్ధితి నెలకొంటుందని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. జగధ్రిలో పార్టీ అభ్యర్ధి ఆదర్శ్‌పాల్ గుజ్జర్‌కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాగా, హరియాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ వెల్లడించిన ఎన్నికల మ్యానిఫెస్టో కాంగ్రెస్ మ్యానిఫెస్టోకు కాపీ పేస్ట్‌లా ఉందని హరియాణ మాజీ సీఎం, విపక్ష నేత భూపీందర్ సింగ్ హుడా అంతకుముందు ఎద్దేవా చేశారు.
క్షేత్రస్ధాయిలో ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి అనూహ్య మద్దతు లభిస్తోందని అన్నారు. పాలక బీజేపీ అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుతున్నారని, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని హరియాణ మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా ధీమా వ్యక్తం చేశారు. హరియాణ ప్రజలు కాషాయ సర్కార్‌ను సాగనంపి కాంగ్రెస్ సర్కార్‌కు పట్టం కట్టనున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు.
Read More :