న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కాషాయ పార్టీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. యూపీలోని ఘజీపూర్ డంపింగ్ యార్డ్‌ను సందర్శించిన కేజ్రీవాల్ బీజేపీపై దుమ్మెత్తిపోశారు. బీజేపీ ఢిల్లీని మురికికూపంగా మార్చి చెత్త నింపడం మినహా రాజధానికి చేసిందేమీ లేదని, ప్రజలంతా ఈ విషయం ఆలోచించాలని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికలకు ముందు ఢిల్లీలోని అతిపెద్ద డంపింగ్ యార్డ్స్‌లో ఒకటైన ఘజీపూర్ ప్రాంతంలోని గార్బేజ్ డంప్‌ను సందర్శించారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ పాలనను కేజ్రీవాల్ తప్పుపడుతూ వారు ఢిల్లీలో ప్రతిచోటా చెత్తను వేయడం తప్ప కాషాయ పాలకులు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ఘజీపూర్‌లో పేరుకుపోయిన చెత్త పర్వతాన్ని చూసేందుకు ఈరోజు తాను ఇక్కడికి వచ్చానని అన్నారు.
బీజేపీ మురికి పార్టీ అని ఆప్ స్వచ్ఛమైన పార్టీ అని ఏదో ఓ రోజు సంబిట్ పాత్రా చెబుతారని, బీజేపీ కార్యకర్తలంతా ఆప్‌లో చేరే రోజు కూడా రానుందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తాను మెజీషియన్ అని, ప్రజల హృదయాలను గెలుచుకోవడం ఎలాగో తనకు తెలుసునని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జీరో అయిందని, ఒకరోజు బీజేపీ కూడా జీరో కానుందని అన్నారు. ఇక ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ఎంసీడీ ఎన్నికలు జరగనున్నాయి.