న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గుజరాత్ చీఫ్ గోపాల్ ఇతలియను పోలీసులు నిర్బంధించడంపై ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. గోపాల్ ఇతలియ అరెస్ట్ పట్ల గుజరాత్‌లోని పటేల్ వర్గీయుల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతున్నదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మరోవైపు ఆప్ నేత రాఘవ్ చద్దా గోపాల్ ఇతలియ అరెస్ట్‌ను ఖండించారు. గోపాల్ సర్ధార్ పటేల్ వారసుడని, ఆయనకు జైలు అంటే భయం లేదని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీపై గోపాల్ ఇతలియ చేసిన అభ్యంతరకర, దిగజారుడు వ్యాఖ్యలు లింగ సమానత్వానికి విరుద్ధంగా ఉన్నాయని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చీప్ రేఖా శర్మ సమన్లు జారీ చేశారు. ఎన్సీడబ్ల్యూ ఎదుట గోపాల్ ఇతలియ గురువారం మధ్యాహ్నం హాజరు కాగా, కార్యాలయం వెలుపల ఆప్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
కాగా, తనను జైలులో పెడతామని ఎన్సీడబ్ల్యూ చీఫ్ హెచ్చరిస్తోందని..పటేల్ వర్గీయులను జైళ్లలో నిర్బంధించడం కన్నా మోదీ ప్రభుత్వం ఇంకేం ఇస్తుందని ఆప్ నేత గోపాల్ ఇతలియ వ్యాఖ్యానించారు. పటేల్ వర్గాన్ని బీజేపీ ద్వేషిస్తోందని, తాను సర్ధార్ పటేల్ సంతతికి చెందిన వాడినని, జైళ్లకు భయపడనని అన్నారు.