Punjab Polls : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తే ఐదేండ్లలో రాష్ట్రాన్ని సుసంపన్నం చేస్తామని ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. 18 ఏండ్లు పైబడిన మహిళలకు నెలకు రూ 1000 నగదు అందిస్తామని, ఉచిత విద్యుత్ ఇస్తామని హామీలు గుప్పించారు. మొహాలీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరిస్తామని ఉచిత విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకువస్తామని భరోసా ఇచ్చారు.
శాంతియుత పంజాబ్ నెలకొనేలా చొరవ చూపుతామని అన్నారు. పంజాబ్‌లో తాము అధికారంలోకి వస్తే డ్రగ్ సిండికేట్‌ను తుడిచిపెడతామని, ప్రార్ధనా మందిరాలను అపవిత్రం చేసిన కేసులను పరిష్కరిస్తామని చెప్పారు. అవినీతికి స్వస్తి పలుకుతామని హామీ ఇచ్చిన కేజ్రీవాల్ పది పాయింట్లతో కూడిన పంజాబ్ మోడల్‌ను ఆవిష్కరించారు. 16,000 మొహల్లా క్లినిక్‌లను ఏర్పాటు చేసి పంజాబీలందరికీ ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు.
రోజుకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భద్రతా లోపం అంశాన్ని కేజ్రీవాల్ ప్రస్తావిస్తూ ప్రధానికి భద్రత కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ప్రధానితో పాటు సామాన్యులకు అవసరమైన భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.