న్యూఢిల్లీ : యూపీలోని లఖింపూర్ ఖేరి ఘటనకు సంబంధించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మోదీ సర్కార్‌పై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేపట్టిన రైతులపై ఎస్యూవీ దూసుకుపోతున్న వీడియోను కేజ్రీవాల్ ప్రస్తావిస్తూ ఈ దృశ్యాలు హృదయాన్ని కలిచివేసేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
శాంతిభద్రతల వ్యవస్ధకు ఈ ఫోటోలు, వీడియోలు సిగ్గుచేటన్నారు. రైతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. లఖింపూర్ ఖేరిలో ఆదివారం ఆందోళనకు దిగిన రైతులపై కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడిదిగా భావిస్తున్న ఎస్యూవీ దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మరణించగా అనంతరం జరిగిన అల్లర్లలో మరో నలుగురు మరణించిన సంగతి తెలిసిందే.