Arvind Kejriwal | న్యూఢిల్లీ: తనకు నోటీసులు పంపడం ద్వారా ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం విశ్వసనీయతను రాజీవ్ కుమార్ నాశనం చేశారని, తాను రిటైరయిన తర్వాత లభించబోయే పదవిపైనే ఆయన దృష్టి ఉందని ఆరోపించారు. ఆయన చేసినంతగా ఎవరూ ఈసీకి ఇంత నష్టం కలిగించ లేదని అన్నారు. ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటే నేరుగా వచ్చి ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చునన్నారు.
తాను బతికున్నంత వరకు విషతుల్యమైన నీటిని ఢిల్లీవాసులు తాగేందుకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించనని చెప్పారు. వారు తనను రెండు మూడు రోజుల్లో అరెస్ట్ చేస్తారన్న విషయం తెలుసని, అయినా తాను భయపడనని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.యమున నదిలో హర్యానా విషం కలుపుతున్నదని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలతో వివాదం రేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇందులో ఎలాంటి విషాలు లేవని నిరూపించేందుకు బుధవారం హర్యానా సీఎం నాయబ్‌సింగ్ సైనీ యమున నీటిని తాగారు. కాగా, యమున వివాదాన్ని రెండు దేశాల మధ్య యుద్ధంగా చూడొద్దని కేజ్రీవాల్‌కు ఈసీ సూచించింది.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇంట్లో ఎన్నికల సంఘం గురువారం సోదాలు నిర్వహించింది. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెడుతున్నారని వచ్చిన ఆరోపణల మేరకు ఈసీకి చెందిన ఫ్లయింగ్ స్కాడ్ కపుర్తలాలోని ఆయన ఇంట్లో సోదాలు జరిపింది. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు.