న్యూఢిల్లీ, ఆగస్టు 3: త్వరలో కృత్రిమ మేధ (ఏఐ) తన సొంత భాషను తయారుచేసుకుంటుందని, ఏఐని సృష్టించిన మానవులు సైతం ఆ భాషను అర్థం చేసుకోలేరని ఏఐ పితామహుడు, నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త జెఫ్రీ హింటన్ హెచ్చరించారు. ప్రస్తుతం ఇంగ్లిష్లో వ్యక్తీకరించే ఆలోచనల సమాహారంగా పనిచేస్తున్న ఏఐ వ్యవస్థలను మనం అర్థం చేసుకోగలుగుతున్నామని ఒన్ డెసిషన్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ఆయన తెలిపారు. అయితే తమలో తాము మాట్లాడుకునేందుకు అవి తమ సొంత భాషను తయారుచేసుకుంటే పరిస్థితి మరింత భయానకంగా మారుతుందని ఆయన వివరించారు.
ప్రమాదకరమైన ఆలోచనలను సృష్టించగల సామర్థ్యం తమకు ఉందని మిషన్లు ఇప్పటికే నిరూపించాయని, మనం అర్థం చేసుకోగల భాషలోనే వాటి ఆలోచనలు ఉంటాయని మనం విశ్వసించలేమని హింటన్ అభిప్రాయపడ్డారు. 2024లో భౌతిక శాస్త్రంలో నోబెల్ గెలుచుకున్న హింటన్, తన కెరీర్ ముగింపు దశ వరకు ఏఐ వ్యవస్థల ప్రమాదాన్ని పసిగట్టలేకపోయాయని, అనర్థాలను ముందుగానే కనిపెట్టి ఉంటే బాగుండేదని ఆయన పేర్కొన్నారు.