Artificial Intelligence | న్యూఢిల్లీ, ఏప్రిల్ 10 : కృత్రిమ మేథ (ఏఐ) టెక్నాలజీ వైద్య రంగంలోనూ సంచలనంగా మారింది. ఐవీఎఫ్ (కృత్రిమ గర్భధారణ)లో ఏఐ సాయంతో ప్రపంచంలోనే తొలి శిశువు జననం మెక్సికోలో జరిగింది. న్యూయార్క్, మెక్సికో వైద్యుల బృందం చేపట్టిన పూర్తి ఆటోమేటెడ్ ఐవీఎఫ్ విధానంతో 40 ఏండ్ల మహిళ ఇక్కడి ఓ దవాఖానలో మగ శిశువుకు జన్మనిచ్చింది. శుక్ర కణాన్ని నేరుగా అండంలోకి ఇంజెక్ట్ చేయటమన్నది (ఐసీఎస్ఐ) ఐవీఎఫ్లో సర్వసాధారణమైన ప్రక్రియ. నిపుణులైన (ఎంబ్రాయలజిస్ట్) వారితో ఐసీఎస్ఐను చేపడతారు.
దీంట్లో ఉండే 23 దశలను మానవ ప్రమేయం లేకుండా ఏఐ సాయంతో వైద్య బృందం పూర్తి చేయటం ఓ సంచలనం. వైద్యులు తయారుచేసిన నూతన పద్ధతిలో పూర్తిస్థాయి ఆటోమేటెడ్ ఐవీఎఫ్ విధానంలో సంతానోత్పత్తి ప్రపంచంలోనే తొలిసారి. దీంతో 1990 నుంచి వైద్యులు ఉపయోగిస్తున్న ఐసీఎస్ఐ సాధారణ ప్రక్రియకు నూతన పద్ధతి ప్రత్యామ్నాయంగా మారనున్నది. శుక్ర కణాల ఎంపిక, అండంలోకి ఇంజెక్ట్ చేయటం, ఫలదీకరణం సహా అనేక ప్రక్రియలను ఏఐ సాయంతో ఆటోమేటెడ్ పద్ధతిలో పూర్తిచేయటం కొత్త పద్ధతిలోని ముఖ్యాంశం.