న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: శాంతి భద్రతల సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై రాజకీయ విమర్శలు తీవ్రమవుతున్న తరుణంలో మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన తాజా హింసాకాండలో ముగ్గురు మరణించారు. పర్వత ప్రాంత జిల్లాల్లో కొనసాగుతున్న అస్థిరతను ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ముల్లం గ్రామ సమీపంలో ఉదయం 11.25 గంటల ప్రాంతంలో ఇద్దరి మృతదేహాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. వారి శరీరాలపై బుల్లెట్ గాయాలు ఉన్నాయి. అదేరోజు తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో నాగాలు అధికంగా నివసించే టాంగ్ఖుల్ గ్రామ సమీపంలో సాయుధ గ్రూపుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘర్షణల సందర్భంగా కొన్ని ఇండ్లకు ప్రత్యర్థులు నిప్పు పెట్టారు. ముల్లం, సొంగ్ఫాల్ గ్రామాల్లో ఇద్దరు గ్రామ కార్యకర్తలను చంపి, ఇండ్లకు నిప్పు పెట్టడాన్ని కుకీ మానవ హక్కుల సంస్థ ఖండించింది. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిర్ణీత కాల వ్యవధిలో దర్యాప్తు చేపట్టాలని సంస్థ డిమాండ్ చేసింది.
సినాకీథే గ్రామ సమీపంలో సాయుధ తీవ్రవాదుల మెరుపుదాడిలో ఓ 29 ఏండ్ల వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో పొరుగున ఉన్న కాంజోంగ్ జిల్లాలోని చత్రిక్ ఖుల్లెన్ గ్రామానికి చెందిన హెచ్ జమాంగ్గా అధికారులు గుర్తించారు. జమాంగ్ హత్యపై టాంగ్ఖుల్ నాగా లోంగ్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. దీనికి సాయుధ కుకీ సభ్యులే బాధ్యులని ఒక ప్రకటనలో ఆరోపించింది. నాగ, కుకీ సంస్థల నుండి వస్తున్న పరస్పర విరుద్ధమైన వాదనలు, ప్రతివాదనలు ఇటీవలి వరకు మణిపూర్ జాతి ఘర్షణల తీవ్రత నుండి సాపేక్షంగా దూరంగా ఉన్న జిల్లాలకు కూడా అపనమ్మకం పెరుగుతున్నదని సూచిస్తున్నాయి. కాగా, తాజా హింసాకాండ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ స్పందనపై విమర్శలు తీవ్రతరమయ్యాయి.
మరోవైపు శనివారం ఇంఫాల్‌లో మణిపూర్ సమగ్రత సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో హింసకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ జరిగింది. ఆరు కీలక డిమాండ్లతో వినతి పత్రం సమర్పించడానికి సీఎం ఖేమ్‌చంద్ ఇంటి వద్దకు నిరసనకారులు చేరుకున్నారు. ఈ సందర్భంగా భద్రతా దళాలతో వారికి ఘర్షణ చెలరేగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భాష్ప వాయు గోళాలు ప్రయోగించడంతో కొందరు గాయపడ్డారు.