న్యూఢిల్లీ: దక్షిణ కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించినవారి మృతదేహాలను తీసుకొచ్చేందుకు సైనిక రవాణా విమానాన్ని భారత ప్రభుత్వం పంపిస్తున్నది. విదేశాల నుంచి కువైట్ వెళ్లిన కార్మికులు నివసిస్తున్న భవనంలో జరిగిన ఈ ప్రమాదంలో 45 మంది భారతీయులు మరణించినట్లు కువైట్ అధికారులు తెలిపారు. మొత్తం మృతుల సంఖ్య 49కి చేరిందని, 50 మంది గాయపడ్డారని చెప్పారు.
మృతదేహాలను వారి స్వదేశాలకు తీసుకెళ్లేందుకు సంపూర్ణంగా సహకరిస్తామన్నారు. న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ, ఈ మృతదేహాలను తీసుకొచ్చేందుకు సైనిక రవాణా విమానం సీ-130 జే విమానం గురువారం బయల్దేరినట్లు చెప్పారు. మృతుల్లో ఎక్కువ మంది కేరళకు చెందినవారేనని, వారి కుటుంబ సభ్యులకు వాటిని అప్పగించేందుకు ఈ విమానం మొదట కొచ్చిలో ఆగుతుందని చెప్పారు.