న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్(Anil Chauhan) ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. మే 10వ తేదీన.. ఆపరేషన్ సింధూర్ సమయంలో.. పాకిస్థాన్ డ్రోన్లను, డ్రోన్ ఆయుధాలను వాడిందని, కానీ ఏ ఒక్కటి కూడా భారతీయ సైనిక లేదా పౌర కేంద్రాలను దాడి చేయలేకపోయినట్లు చెప్పారు. కైనిటిక్, నాన్ కైనటిక్ పద్దతుల్లో ఆ డ్రోన్లను కూల్చివేశామని ఆయన తెలిపారు. కొన్ని డ్రోన్లను రికవరీ చేసినట్లు ఆయన చెప్పారు. యూఏఎస్ డ్రోన్ వ్యవస్థలు చాలా కీలకమైందని, స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసిన ఆ వ్యస్థలన్నీ ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎంతో ఉపయోగపడినట్లు తెలిపారు. మనల్ని మనం రక్షించుకునేందుకు డ్రోన్లపై ఇన్వెస్ట్ చేయాలన్నారు.
యుద్ధాల్లో డ్రోన్ల వినియోగం పెరిగినట్లు అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. వీటి గురించి చర్చించినప్పుడు.. డ్రోన్ల వ్యవస్థలో వికాసం సాధించామా లేక విప్లవాత్మక వినియోగం జరుగుతుందా అని ఆలోచించాల్సి వస్తుందన్నారు. డ్రోన్ల వ్యవస్థలో జరుగుతున్న అభివృద్ధిని వికాసంగా పరిగణించాలని, ఇక యుద్ధాల్లో వాటిని వాడుతున్న తీరును విప్లవాత్మకమైందిగా భావించాలని అనిల్ చౌహాన్ తెలిపారు. యుద్ధాల్లో డ్రోన్ల వినియోగం విస్తరించిందన్నారు. విప్లవాత్మకమైన రీతిలో ఆర్మీ డ్రోన్లను వాడుతున్నట్లు ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో జరుగుతున్న యుద్ధాల్లో డ్రోన్ల పనితీరును ప్రత్యక్షంగా చూస్తున్న విషయం తెలిసిందే.