లేటరల్ ఎంట్రీ ద్వారా రిజర్వేషన్లకు మోదీ సర్కార్ తూట్లు పొడుస్తున్నదని విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ లోక్‌సభలో విపక్ష నేతని, ఆయన రాజ్యాంగ పదవిలో ఉన్నారని, బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం ఆయనకు తగదని ఆక్షేపించారు. లేటరల్ ఎంట్రీ ద్వారా ఆరెస్సెస్ వ్యక్తులను ఉన్నత పదవుల్లో నియమిస్తారని రాహుల్ గాంధీ చెప్పడం ఆయన అవగాహనారాహిత్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ సైతం లేటరల్ ఎంట్రీలో భాగమేనని గుర్తుచేశారు. 1976లో మీరు ఆయనను నేరుగా ఫైనాన్షియల్ సెక్రటరీగా ఎలా నియమించారని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. మీ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ కూడా లేటరల్ ఎంట్రీలో భాగమేనని అన్నారు. ఇలాంటి వందలాది ఉదాహరణలు కనిపిస్తాయని, లేటరల్ ఎంట్రీని తీసుకొచ్చిందే మీరని రాహుల్‌ను ఉద్దేశించి కేంద్ర మంత్రి పేర్కొన్నారు. లేటరల్ ఎంట్రీని మీరు ప్రారంభిస్తే దాన్ని మోదీ క్రమబద్ధీకరణ చేశారని చెప్పారు.
2005లో పరిపాలనా సంస్కరణల కమిషన్ ఏర్పాటైందని, దాని నివేదిక బయటకువచ్చిందని తెలిపారు. 2005 నుంచి యూపీఏ అధికారంలో ఉందని గుర్తుచేశారు. తాము రిజర్వేషన్లకు చరమగీతం పాడతామని చెబుతున్నారని, అసలు మీరు ఎప్పుడు నియామకాలు చేపట్టారని మీరు ఏం చేశారని కేంద్ర మంత్రి నిలదీశారు. కాంగ్రెస్‌కు హఠాత్తుగా ఓబీసీలపై ప్రేమ పెరిగిపోయిందని ఎద్దేవా చేశారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ స్వయంగా తాను ఓబీసీ రిజర్వేషన్‌కు వ్యతిరేకమని చెప్పారని, కానీ ఇప్పుడు కాంగ్రెస్‌కు ఓబీసీలపై ప్రేమ పుట్టుకొచ్చిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్ధులను కాంగ్రెస్ తప్పుదారిపట్టిస్తోందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ దుయ్యబట్టారు.
Read More :