MUDA : ముడా కుంభకోణంలో తనపై విచారణకు కర్నాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అనుమతి ఇవ్వడాన్ని సీఎం సిద్ధరామయ్య హైకోర్టులో సవాల్ చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. రిట్ పిటిషన్లో ప్రాసిక్యూషన్ నుంచి తాత్కాలిక ఉపశమనం కల్పించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరామని చెప్పారు. హైకోర్టులో సిద్ధరామయ్య దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించనున్నారు.
తాను 40 ఏండ్లుగా మంత్రిగా వ్యవహరించానని తన రాజకీయ జీవితంలో ఎక్కడా ఎలాంటి మచ్చా లేదని చెప్పారు. ప్రజల ఆశీస్సులతో వారి సేవలో కొనసాగుతున్నానని అన్నారు. తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని చెబుతూ తాను ఎలాంటి తప్పూ చేయలేదని రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసునని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇక ముడా స్కామ్‌లో కర్నాటక సీఎం సిద్ధరామయ్య విచారణకు గవర్నర్ అనుమతించిన క్రమంలో సిద్ధరామయ్య సీఎం పదవికి తక్షణమే రాజీనామా చేయాలని కర్నాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర అంతకుముందు డిమాండ్ చేశారు.
సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బ్లాక్‌మెయిల్‌కు తాము భయపడబోమని స్పష్టం చేశారు. అవినీతి కుంభకోణాలకు వ్యతిరేకంగా తాము మూడు నెలలుగా పోరాడుతున్నామని చెప్పారు.ఇప్పుడు గవర్నర్ స్పందించి సీఎం ప్రాసిక్యూషన్‌కు అనుమతించడంతో కాంగ్రెస్, సిద్ధరామయ్య ఈ వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. లూటీ చేసిన సొమ్ము ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్‌కు చేరవేయడంతో విపక్ష నేత రాహుల్ గాంధీ సిద్ధరామయ్యను రాజీనామా చేయాలని కోరతారని తాము అనుకోవడం లేదని విజయేంద్ర వ్యాఖ్యానించారు.