INDIA Alliance | న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ఇండియా కూటమిలో మళ్లీ మంటలు రాజుకున్నాయి. కాంగ్రెస్ పార్టీని కూటమి నుంచి బయటకు పంపేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ పావులు కదుపుతున్నది. కూటమి నాయకత్వాన్ని కాంగ్రెస్ వదులుకోవాలని ఇన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్న పార్టీలు ఇక కాంగ్రెస్‌నే వదిలించుకోవాలనే నిర్ణయానికి వస్తున్నాయి.
ఈ మేరకు హస్తం పార్టీని బయటకు పంపించే ప్రయత్నాలను ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌పై కూటమి పార్టీల్లో మొదలైన అసంతృప్తి ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే తీవ్రమయ్యింది. ఢిల్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేయాలని ఇప్పటికే ఆప్, కాంగ్రెస్ నిర్ణయించాయి.
దీంతో అరవింద్ కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. ఆయన దేశ వ్యతిరేకి అని ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ తీవ్ర విమర్శ చేశారు. 2013లో మొదటిసారి ఆప్ ప్రభుత్వం ఏర్పడటానికి మద్దతు ఇవ్వడం వల్లే ఢిల్లీలో తమ పార్టీ బలహీనపడిందని వ్యాఖ్యానించారు. మరోవైపు ఉనికిలో లేని పథకాల కోసం లబ్ధిదారుల నమోదు ప్రక్రియను ఆప్ ప్రభుత్వం చేపట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాంగ్రెస్ తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడుతున్నది. గురువారం ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. అజయ్ మాకెన్‌పై కాంగ్రెస్ పార్టీ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 24 గంటల అల్టిమేటం ఇచ్చారు. 24 గంటల్లో మాకెన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు కాకపోతే ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ను తప్పించాలని కూటమిలోని మిగతా పార్టీలను డిమాండ్ చేయనున్నట్టు చెప్పారు. ఢిల్లీ ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం చేసి, బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను బీజేపీనే సిద్ధం చేసిందని అన్నారు. ఢిల్లీ సీఎం ఆతిశీ సైతం కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల ఖర్చు కోసం కాంగ్రెస్ అభ్యర్థులకు బీజేపీ నిధులు అందిస్తున్నదని తమకు విశ్వసనీయ సమాచారం ఉందని ఆమె పేర్కొన్నారు. కేజ్రీవాల్ దేశ వ్యతిరేకి అయితే లోక్‌సభ ఎన్నికల్లో తమతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు.
హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల నుంచి కాంగ్రెస్‌పై ఇండియా కూటమిలోని మిగతా పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ తీరు వల్లే ఈ రాష్ర్టాల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయని ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నాయకత్వాన్ని తీసుకునేందుకు మమతా బెనర్జీ ముందుకొచ్చారు. రాహుల్ గాంధీ నాయకత్వంపై నమ్మకం కోల్పోతున్న పార్టీలు ఆమె వైపు మళ్లాయి. మమత నాయకత్వానికి ఎస్పీ, ఆర్జేడీ, ఎన్సీపీ(ఎస్పీ) వంటి కీలక భాగస్వామ్యపక్షాలు మద్దతు తెలిపాయి. కాంగ్రెస్ మాత్రం నాయకత్వాన్ని వదులుకునేందుకు సిద్ధపడలేదు. ఇప్పుడు కూటమి నుంచి కాంగ్రెస్‌ను మొత్తానికే తప్పించేందుకు ఆప్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌కు కేజ్రీవాల్ ఫోన్ చేశారని ప్రచారం జరుగుతున్నది.