Lucknow | ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు ఏక కాలంలో బీజేపీని వీడిపోవడంపై బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ ఘాటుగా స్పందించింది. నేతలందరికీ ఆత్మాభిమానాలుంటాయని, కాస్త వాటిపై దృష్టి పెట్టాలని బీజేపీకి ఉద్బోధించింది. అయితే మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు కూడబలుక్కొని బీజేపీకి గుడ్‌బై చెప్పడం మాత్రం అత్యంత దురదృష్టకరమని అప్నాదళ్ అధ్యక్షుడు ఆశీష్ పటేల్ అన్నారు.
ఆత్మాభిమానంపై బీజేపీ దృష్టి సారించాలని, ముఖ్యంగా కేంద్ర హోమంత్రి ఈ విషయంలో కాస్త ఆలోచించాలని ఆయన కోరారు. ముఖ్యంగా సామాజిక న్యాయం అన్న అంశంతో ముడిపడి వున్న నేతలపై కాస్త దృష్టి నిలపాలని, ఈ నేపథ్యం ఉన్నవారు రావాలని కోరుకుంటున్నారు కాబట్టి, అమిత్‌షాయే దృష్టి నిలపాలని ఆశీష్ తేల్చి చెప్పారు.
యూపీ ఎన్నికల సందర్భంగా కమలం అల్లకల్లోలమైపోతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కీలక తరుణంలో వికసించాల్సిన కమలం పార్టీ… ఏ రేకు కా రేకు విడిపోతుండటంతో అధిష్ఠానంలో కలవరం ప్రారంభమైంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆలోచించుకునే లోపలే.. ఒక్కో నేత బీజేపీకి రాం రాం చెప్పేస్తున్నారు. దీంతో యూపీ బీజేపీలో ముసలం పుట్టింది. ఒక్క మంగళవారం రోజునే ఓ కీలక మంత్రితో సహా, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి గుడ్‌బై చెప్పేశారు. దీంతో యూపీ రాజకీయాలు ఒక్కసారిగా కీలక మలుపు తీసుకున్నాయి.
కార్మిక మంత్రిగా బాధ్యతల్లో ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య తన మంత్రి పదవికి రాజీనామా చేసి, బీజేపీకి గుడ్ బై చెప్పేసిన కాసేపటికే మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసేశారు. అందులో రోషన్ లాల్ వర్మ, బ్రిజేశ్ ప్రజాపతి, భగవతి సాగర్ ఉన్నారు. ఈ ముగ్గురు కూడా మంత్రి స్వామి మౌర్యకు మద్దతుగానే రాజీనామాలు చేసి, బీజేపీకి ఝలక్ ఇచ్చారు.