న్యూఢిల్లీ: ఎలాంటి సైనిక దాడి జరిగినా భారత్ గట్టిగా బదులిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) తెలిపారు. అయితే పాకిస్థాన్‌తో పరిస్థితిని మరింత తీవ్రతరం చేయాలనే ఉద్దేశం భారత్‌కు లేదన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ తరుణంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి బుధవారం అర్ధరాత్రి ఢిల్లీ చేరుకున్నారు. గురువారం కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆయనతో సమావేశమయ్యారు. అనాగరికమైన పహల్గామ్ ఉగ్రదాడి కారణంగా భారత సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయాల్సి వచ్చిందని వివరించారు.
కాగా, సరిహద్దు ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే భారత్ లక్ష్యమని ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. పాకిస్థాన్‌తో పరిస్థితిని మరింత తీవ్రం చేయడం తమ ఉద్దేశం కాదని అన్నారు. అయితే తమ దేశంపై సైనిక దాడులు జరిగితే, దానికి చాలా దృఢమైన ప్రతిస్పందన ఎదురవుతుందని పాక్‌ను హెచ్చరించారు. పొరుగుదేశమైన పాకిస్థాన్, భారత్ మధ్య నెలకొన్న పరిస్థితుల గురించి ఇరాన్‌కు మంచి అవగాహన ఉందన్నారు.