IND vs PAK : భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ ఉగ్రవాదులకు, ఉగ్రవాదులకు మద్దతు పలుకుతున్న వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక నుంచి దేశంలో ఎలాంటి ఉగ్రవాద దాడి (Terror attack) జరిగినా దానిని భారత్‌పై యుద్ధంగానే పరిగణిస్తామని, అందుకు ధీటుగా బదులిస్తామని స్పష్టం చేసిందని వెల్లడించాయి.
గత నెల 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి యావత్ భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆ దాడిలో ఉగ్రవాదులు ఏకంగా 26 మంది పర్యాటకులను కాల్చిచంపడాన్ని ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ దాడికి పాల్పడింది పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులేనని తేలడంతో భారత్ రగిలిపోయింది. పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై సర్జికల్స్ స్ట్రైక్స్ చేస్తోంది. అందుకు ప్రతిగా పాకిస్థాన్ సరిహద్దుల్లో కాల్పులు జరుపుతూ కవ్వింపులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా హెచ్చరికలు చేసింది.