First Farmers | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): ప్రపంచానికి వ్యవసాయాన్ని పరిచయం చేసింది మనుషులేనని ఇప్పటివరకూ చెప్పుకొంటున్నాం. అయితే, మనుషులు పుట్టకముందే, ఇంకా కచ్చితంగా చెప్పాలంటే 6.6 కోట్ల ఏండ్ల కిందటే చీమలు వ్యవసాయాన్ని చేశాయి. ఇప్పటికీ చేస్తున్నాయి. అలా భూమి మీద వ్యవసాయం చేసిన తొలి జీవిగా చీమ నిలిచింది. ఈ విషయాన్ని అమెరికాలోని స్మిత్సోనియన్స్ నేషనల్ మ్యూజియమ్ ఆఫ్ నేచురల్ హిస్టరీ పరిశోధకులు తాజా అధ్యయనం ద్వారా గుర్తించారు. ఈ వివరాలు ‘సైన్స్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
ఆస్టరాయిడ్ ఢీకొట్టడంతో..
6.6 కోట్ల ఏండ్ల కిందట డైనోసార్లు భూమిపై సంచరించేవి. అప్పుడు ఖగోళంలో నుంచి దూసుకొచ్చిన ఓ భారీ ఆస్టరాయిడ్ భూమిని అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కొన్ని డైనోసార్లు మరణించాయి. మరోవైపు, ఆస్టరాయిడ్ ఢీకొట్టడంతో వాతావరణలోకి పెద్దఎత్తున ధూళి ఎగసింది. ఆ ధూళి మేఘం సూర్యరశ్మిని భూమికి చేరనీయకుండా అడ్డుకోవడంతో వాతావరణ మార్పులు జరిగి, ఆహారం దొరక్క మిగిలిన డైనోసార్లతో పాటు ఇతరత్రా జీవరాశులు కూడా అంతరించిపోయాయి. ఇదే సమయంలో చీమలు కూడా తమ ఆహారాన్ని సంపాదించుకోవడానికి వ్యవసాయాన్ని చేయడం ప్రారంభించాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
సాగు మొదలైంది ఇలా..
ఆస్టరాయిడ్ ఢీకొట్టిన ప్రభావంతో సూర్యరశ్మి లేకపోవడంతో మొక్కలు చనిపోయే స్థితికి చేరాయి. ఇటు చీమలకు కూడా ఆహారం దొరకని పరిస్థితి. దీంతో మొక్కల ఆకుల్లోని కొంతభాగాన్ని కత్తిరించిన చీమలు తాము నివాసం ఉండే పుట్టలోకి ఆ ఆకుల భాగాలను తీసుకువెళ్లాయని పరిశోధకులు గుర్తించారు. పంటలు పండించడానికి మనుషులు ఎలాగైతే విత్తనాలను సేకరిస్తారో.. తమ ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవడానికి ఈ ఆకుల భాగాలను కూడా విత్తనాలు, ఎరువులుగా చీమలు వినియోగించుకొనేవని పరిశోధకులు పేర్కొన్నారు. అలా తీసుకెళ్లిన ఆకుల భాగాలను వెలుతురు సోకని ప్రదేశంలో కొంతకాలం ఉంచి శిలీంధ్రాలు ఏర్పడేలా చేసేవని, అలా ఏర్పడిన శిలీంద్రాలను చీమలు ఆహారంగా తీసుకొనేవని తెలిపారు.
ఇప్పటికీ అలాగే..
అమెరికా, కరేబియన్ దీవుల్లో నివసించే లీఫ్కట్టర్ రకానికి చెందిన 250 రకాల చీమ జాతులు ఇప్పటికీ ఈ తరహా వ్యవసాయాన్నే చేస్తున్నాయని పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త టెడ్ షల్డ్ పేర్కొన్నారు. భూమిపై వ్యవసాయాన్ని చేసిన తొలి జీవులు చీమలేనని అభివర్ణించారు. 475 శిలీంద్ర జాతులు, 276 రకాల చీమజాతులపై చేసిన జన్యుపరమైన విశ్లేషణల ఆధారంగా ఈ విషయాన్ని నిర్ధారించినట్టు పేర్కొన్నారు. కాగా, భూమి మీద మొదటి సర్జన్లుగా చీమలకు గుర్తింపు ఉండటం తెలిసిందే.