బారిపడా: బీజేపీ పాలిత ఒడిశాలో వరుస లైంగిక దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. మయూర్భంజ్ జిల్లాలో గత సోమవారం రాత్రి ఓ వివాహితపై నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు గురువారం వెల్లడించారు.
బారిపడా సర్దార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే బాధితురాలి భర్త ఫిర్యాదు ప్రకారం.. బాధితురాలి కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేని సమయంలో వారి కుటుంబానికి తెలిసిన నలుగురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఆమెను బలవంతంగా మరొక ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. రేప్ గురించి ఎవరికైనా చెప్తే చంపేస్తామని బాధితురాలిని బెదిరించి పరారైపోయారు.
బాధితురాలు పోలీసులకు నిందితుల పేర్లను వెల్లడించింది. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానలో ఆమె చికిత్స పొందుతున్నది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. వరుసగా మూడు రోజుల వ్యవధిలో జరిగిన మూడో లైంగిక దాడి ఇది.