Bathinda Military Station | పంజాబ్ (Punjab)లోని బఠిండా సైనిక స్థావరం (Bathinda Military Station)లో బుధవారం తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మరణించారు. కాగా, తాజాగా బుల్లెట్ గాయాలతో మరో జవాను ప్రాణాలు కోల్పోయినట్లు ఆర్మీ (Army) అధికారులు గురువారం వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున కాల్పులు జరిగిన కొద్ది గంటల్లోనే చోటు చేసుకున్న మరో ఘటనలో జవాను ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అయితే, తాజా ఘటనకు అంతకుముందు జరిగిన కాల్పులతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అయితే జవాను ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక ఏదైనా ప్రమాదం జరిగిందా..? అన్నదానిపై స్పష్టత లేదు. ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో మరణించినట్లు ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు.
‘బఠిండా సైనిక స్థావరంలో బుధవారం సాయత్రం 4:30 గంటల ప్రాంతంలో ఒక సైనికుడు తుపాకీ గాయంతో మరణించాడు. అతను ప్రత్యేక యూనిట్‌కు చెందినవాడు. తన సర్వీస్ వెపన్తో సెంట్రీ డ్యూటీలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన అనంతరం మిలిటరీ ఆసుపత్రికి తరలించాం. కానీ తీవ్రమైన గాయాల కారణంగా జవాను మరణించాడు. అంతకు ముందు జరిగిన కాల్పుల ఘటనకు ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదు. అయితే అతడిది ఆత్మహత్యా..? లేక ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో మరణించాడా అన్నది తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. కేసు దర్యాప్తు చేస్తున్నాం’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాగా, తాజా ఘటనతో 24 గంటల వ్యవధిలోనే బఠిండా సైనిక స్థావరంలో ఐదుగురు జవాన్లు మృతి చెందారు.
బుధవారం తెల్లవారుజామున 4.35 గంటల ప్రాంతంలో బఠిండా మిలటరీ స్టేషన్లో ఆగంతకులు కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మరణించారు. కాల్పుల అనంతరం సాయుధులు ఘటనాస్థలి నుంచి పారిపోయారు. సమాచారం అందుకొన్న క్విక్ రెస్పాన్స్ బృందాలు ఆ ప్రాంతాన్ని వెంటనే తన ఆధీనంలోకి తీసుకొని కార్టెన్ సెర్చ్ చేపట్టాయి. మిలటరీ స్టేషన్ తలుపులు మూసేసి కాల్పులకు పాల్పడిన వారి కోసం గాలింపు చేపట్టాయి. సైనిక స్థావరంలోని ఆఫీసర్స్ మెస్ వద్ద ఈ కాల్పుల ఘటన చోటుచేసుకొన్నది. కాగా, ఈ దాడిలో ఉగ్రకోణం లేదని, బయటి నుంచి ఇది జరగలేదని పంజాబ్ ఏడీజీపీ పర్మార్ పేర్కొన్నారు. అంతర్గత విబేధాల కారణంగా కాల్పుల ఘటన జరిగిందని, ఇద్దరు వ్యక్తులు సాధారణ పౌరుల దుస్తుల్లో వచ్చి దాడి చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
Also Read..
India Corona | 10 వేలు దాటిన కొత్త కేసులు.. 19 మంది మృతి..!
Drone | కశ్మీర్లో వాస్తవాధీన రేఖ వద్ద డ్రోన్ కూల్చివేత.. ఆయుధాలు, నగదు స్వాధీనం