చండీగఢ్: పాకిస్థాస్కు రహస్యాలు చేరవేసే మరో గూఢచార నెట్వర్క్ గుట్టు రట్టయ్యింది. (Pak spy network busted) ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు కీలక సమాచారాన్ని లీక్ చేసిన ఇద్దరిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను గురుదాస్‌పూర్‌కు చెందిన సుఖ్‌ప్రీత్ సింగ్, కరణ్‌బీర్ సింగ్‌గా గుర్తించారు. 19 నుంచి 20 ఏళ్ల వయస్సున్న ఇద్దరు యువకులు ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన వివరాలతోపాటు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్‌లో సైనిక దళాల కదలికలు, కీలకమైన వ్యూహాత్మక ప్రదేశాల సమాచారాన్ని పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకు అందించారని పంజాబ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌరవ్ యాదవ్ తెలిపారు. నిఘా సంస్థల సమాచారం ఆధారంగా వారి మొబైల్ ఫోన్లు పరిశీలించగా పాక్‌కు గూఢచర్యం వహిస్తున్నట్లుగా నిర్ధారణ అయ్యిందని చెప్పారు.
కాగా, మూడు మొబైల్ ఫోన్లు, ఎనిమిది లైవ్ కార్ట్రిడ్జ్లను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. వారి బ్యాంకు ఖాతాలకు లక్ష బదిలీ అయ్యిందని బోర్డర్ రేంజ్ డీఐజీ సతీందర్ సింగ్ చెప్పారు. గత 20 రోజులుగా పాకిస్థాన్‌కు రహస్య సమాచారాన్ని వారు లీక్ చేస్తున్నారని ఆరోపించారు. గురుదాస్‌పూర్ పోలీసులు దీనిని ఛేదించారని తెలిపారు. నిందితులైన యువకులు డ్రగ్స్‌కు బానిస అయ్యారని అన్నారు. అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలిసే అవకాశమున్నదని వెల్లడించారు.