Maha Kumbh Mela | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ప్రయాగ్రాజ్ (Prayagraj)లో జరుగుతున్న మహాకుంభ మేళా (Maha kumbha Mela)లో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. సెక్టార్ 18లోని హరిశ్చంద్ర మార్గ్ (Harishchandra Marg ) సమీపంలో ఖాళీ గుడిసెల్లో గురువారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో గుడిసెలు ఖాళీగా ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఇక కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ అక్కడ అగ్నిప్రమాదం జరగడం ఇది ఐదోసారి.
#WATCH | Prayagraj | A fire broke out in a vacant hut near Harishchandra Marg in Sector 18 of Mahakumbh. The fire was extinguished by the Fire department personnel.
(Source: Fire Department) pic.twitter.com/rM2iOXlkIn
— ANI (@ANI) February 13, 2025
తొలుత ఈనెల 19వ తేదీన మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఎల్పీజీ సిలిండర్ పేలడంతో సెక్టార్ 19లో మంటలు చెలరేగి 18 గుడారాలు ఆహుతయ్యాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. నల్లటి దట్టమైన పొగలు అలుముకోవడంతో అఖాడాల సమీపంలో భయాందోళన నెలకొంది. సాయంత్రం 4 గంటలకు మంటలు అంటుకోగా గంటలోపలే మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. ఆతర్వాత వారం రోజులకే అంటే ఈనెల 25వ తేదీన మరోసారి అగ్నిప్రమాదం జరిగింది.
కుంభమేళాకు వెళ్లే ప్రధాన రహదారిలోని సెక్టార్ 2 సమీపంలోని పార్కింగ్ ఏరియాలో మంటలు చెలరేగాయి. అక్కడ విపరీతమైన వేడి కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఓ కారు పూర్తిగా దగ్ధం కాగా, మరో కారు పాక్షికంగా దెబ్బతిన్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత జనవరి 30న సెక్టర్ 22లో ఛత్నాగ్ ఝాన్సీ (Chhatnag Jhunsi) ప్రాంతంలో నిర్మించిన టెంట్ సిటీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో డజనుకుపైగా టెంట్లు కాలిపోయాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 7వ తేదీన శంకరాచార్య మార్గ్ (Shankaracharya Marg)లోని సెక్టార్ 18లో శుక్రవారం ఉదయం మంటలు చెలరేగాయి. అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు మంటల్లో దగ్ధమయ్యాయి. ఈ నాలుగు ఘటనల్లోనూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
కాగా, ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరు గాంచిన ఈ కుంభమేళాలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మౌని అమావాస్య సందర్భంగా గత నెల 29వ తేదీన కుంభమేళా ప్రాంతంలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 60 మంది గాయపడ్డారు. ఇలా వరుస ప్రమాదాలతో యాత్రికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి 13వ తేదీన మహాకుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 శివరాత్రి వరకూ ఈ కుంభమేళా కొనసాగనుంది. దాదాపు 45 రోజులపాటూ జరిగే ఈ మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 55 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు 48.25 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు.
Also Read..
DY Chandrachud | భారత న్యాయవ్యవస్థలో రాజకీయ జోక్యం..? మాజీ సీజేఐ ఏమన్నారంటే..?
Maha Kumbh | ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 48 కోట్ల మంది పుణ్యస్నానాలు