MOTN poll | దేశంలో కాంగ్రెస్ (Congress) పార్టీకి ఆదరణ తగ్గుతోందని ఓ సర్వేలో వెల్లడైంది. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో పుంజుకున్న కాంగ్రెస్.. ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తాపడిన విషయం తెలిసిందే. గెలుస్తుందనుకున్న రాష్ట్రాల్లో కూడా ఘోర పరాభవం మూటగట్టుకుంది. దీంతో ఇక కాంగ్రెస్ పని అయిపోయిందని అంతా భావిస్తున్నారు. ఈ సమయంలో ఓ సంస్థ చేపట్టిన సర్వేలో కూడా ఇదే విషయం వెల్లడైంది.
గత ఎన్నికల్లో సెంచరీకి చేరువగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు పెడితే ఆ దరిదాపుల్లోకి కూడా వచ్చే పరిస్థితి లేదని తేలింది. 542 స్థానాలకు గానూ కేవలం 78కే పరిమితమయ్యే అవకాశం ఉందని ఇండియా టుడే, సీఓటర్ (India Today-Cvoter) సంయుక్తంగా నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పోల్ (Mood of the Nation opinion poll)లో వెల్లడైంది.
తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్..
ఆరు గ్యారంటీలు అని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ.. పాలన చేపట్టి ఏడాది గడిచినా ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేకపోతోంది. దీంతో ఇక్కడ ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరో రాష్ట్రం కర్ణాటకలో సైతం ఇదే పరిస్థితి. అక్కడ కూడా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేక అవస్థలు పడుతోంది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక ఈ రెండు రాష్ట్రాల పాలనా వైఫల్య ప్రభావం దేశంలో ఇతర రాష్ట్రాలపై పడింది. ఫలితంగా మొన్న జరిగిన మహారాష్ట్ర, హర్యానా, నిన్న జరిగిన ఢిల్లీ ఎన్నికల్లోనూ ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు తాజా సర్వే ఫలితం కాంగ్రెస్కు కోలుకోలేని దెబ్బే అని చెప్పొచ్చు.
ఇక ఇదే సర్వేలో బీజేపీ (BJP)కి ఆదరణ క్రమంగా పెరుగుతున్నట్లు వెల్లడైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే.. ఎన్డీయే కూటమి 300 పైచిలుకు సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇందులో బీజేపీ సొంతంగా 281 స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొంది. ఈ ఏడాది జనవరి 2 నుంచి ఫిబ్రవరి 9 వరకు దేశవ్యాప్తంగా 1,25,123 మందిని ప్రశ్నించి, వారి అభిప్రాయాలను సేకరించినట్లు తెలిపింది.
2024 ఎన్నికల్లో ‘అబ్ కీ బార్.. 400 పార్’ అన్న నినాదంతో బీజేపీ ఊదరగొట్టిన విషయం తెలిసిందే. చివరికి 292 స్థానాల్లో మాత్రమే ఎన్డీయే గెలిచింది. అయితే, ఎన్నికలు పూర్తయిన ఆరు నెలల తర్వాత ప్రస్తుతం బీజేపీ గణనీయంగా పుంజుకుందని, ఎన్డీయే కూటమికి ప్రజాదరణ పెరిగిందని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడించింది. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం బీజేపీ క్యాడర్లో జోష్ పెంచిందని తెలిపింది. ఈ క్రమంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమి 343 సీట్లలో విజయ ఢంకా మోగిస్తుందని చెప్పింది.
ఇక మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో 232 సీట్లు గెలుచుకున్న ఇండియా కూటమి (కాంగ్రెస్కు సొంతంగా 99) ప్రస్తుతం 188 సీట్లను (కాంగ్రెస్కు సొంతంగా 78) దక్కించుకుంటుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా బీజేపీ హవా పెరుగుతుండగా కాంగ్రెస్ ప్రాభవం పడిపోతోందని పేర్కొంది. ఓట్ షేర్ ఏకంగా 20 శాతం పడిపోతుందని సర్వే అంచనా వేసింది.
Also Read..
Waqf bill | వక్ఫ్ సవరణ బిల్లుపై నివేదికకు రాజ్యసభ ఆమోదం
Leopard | పెళ్లి వేడుకలో చిరుత ప్రత్యక్షం.. భయంతో పరుగులు తీసిన అతిథులు.. VIDEO