సహస్ర: బీహార్‌లో బుధవారం మరో బ్రిడ్జి కూలింది. సహస్ర జిల్లాలోని మహిషి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇలా బ్రిడ్జి కూలడం 3 వారాల వ్యవధిలో ఇది 13వది. ఇది చిన్న బ్రిడ్జి లేదా కాజ్వే కావచ్చునని జిల్లా అధికారులు తెలిపారు.రాష్ట్రంలో ఇటీవల వరుసగా బ్రిడ్జీలు కూలుతుండటంతో వాటికి బాధ్యులను చేస్తూ బీహార్ ప్రభుత్వం ఇప్పటికే 15 మంది ఇంజనీర్లను సస్పెండ్ చేసింది.
14 ఉత్పత్తుల అమ్మకాల నిలిపివేత వార్త అవాస్తవం: పతంజలి
న్యూఢిల్లీ: 14 ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేసినట్లు వచ్చిన మీడియా కథనాలపై పతంజలి ఆయుర్వేద వివరణ ఇచ్చింది. ఈ ఉత్పత్తుల తయారీకి ఇచ్చిన లైసెన్సులను ఉత్తరాఖండ్ ప్రభుత్వం సస్పెండ్ చేసి, అనంతరం పునరుద్ధరించిందని తెలిపింది. ఈ ఉత్పత్తుల ప్రచార వాణిజ్య ప్రకటనలను ఉపసంహరించుకున్నారా? లేదా? తెలియజేస్తూ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని తమను సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపింది. తదుపరి విచారణ ఈ నెల 30న జరుగుతుందని తెలిపింది. “పతంజలి 14 ఉత్పత్తుల అమ్మకాలను నిలిపేసింది” అనే వార్త తప్పు అని స్పష్టం చేసింది.