ముంబై, న్యూఢిల్లీ, అక్టోబర్ 20: భారత విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. తాజాగా ఆదివారం 25 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇండిగో, విస్తారా, ఆకాశ ఎయిర్, ఎయిర్ ఇండియా సంస్థలకు చెందిన స్వదేశీ, విదేశీ విమాన సర్వీసులకు ఈ బెదిరింపులు వచ్చాయి. ఈ వారంలో ఇప్పటివరకు 90కి పైగా విమానాలకు ఇలా బెదిరింపులు వచ్చాయి. తాజా బెదిరింపుల దృష్ట్యా భద్రతా తనిఖీలు నిర్వహించామని ఇండిగో, విస్తారా సంస్థలు తెలిపాయి. చాలావరకు సామాజిక మాధ్యమాల ద్వారా వస్తున్న బాంబు బెదిరింపులను దృష్టిలో ఉంచుకొని పౌర విమానయాన భద్రత బ్యూరో శనివారం వివిధ విమానయాన సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. బూటకపు బాంబు బెదిరింపుల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించింది. నకిలీ బాంబు బెదిరింపు ఘటనలను నిరోధించడానికి అలాంటి బెదిరింపులకు పాల్పడే నేరస్థుల విమానయానాన్ని నిషేధించడంతో పాటు కఠిన నిబంధనలను అమలు చేయాలని పౌర విమానయాన శాఖ యోచిస్తున్నది.