Rahul Gandhi | న్యూఢిల్లీ, అక్టోబర్ 10: గెలుపు ఖాయమనుకున్న హర్యానాలో ఓటమిని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతున్నది. ఓటమికి కారణాలను విశ్లేషించడానికి గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమీక్ష సమావేశం జరిగింది. రాహుల్ గాంధీతో పాటు హర్యానా ఎన్నికలకు పరిశీలకులుగా వ్యవహరించిన అజయ్ మాకెన్, అశోక్ గెహ్లోట్, దీపక్ బబారియా, కేసీ వేణుగోపాల్, హర్యానా కాంగ్రెస్ కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా హర్యానా కాంగ్రెస్ నేతలపై రాహుల్ గాంధీ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారని తెలుస్తున్నది. ఈవీఎంల వల్లనే ఓడిపోయామని నేతలు చెప్పగా కౌంటింగ్, ఈవీఎంల విషయంలో ఎక్కడ తప్పులు జరిగాయో తనకు సమగ్ర నివేదిక ఇవ్వాలని నేతలకు ఆయన సూచించారు. ‘మీరు స్వార్థపరులు. మీ గురించే ఆలోచించారే కానీ పార్టీ గురించి ఆలోచించలేదు.
మీలో మీరు కొట్లాడుకొని పార్టీకి నష్టం చేశారు. లేదంటే మనం గెలిచే వాళ్లం’ అంటూ రాహుల్ గాంధీ హర్యానా నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి వెళ్లిపోయారని తెలుస్తున్నది. హర్యానాలో కాంగ్రెస్ కీలక నేతలు భూపిందర్ సింగ్ హుడా, కుమారి శెల్జా మధ్య ఆధిపత్య పోరు ఎన్నికల్లో ఆ పార్టీకి నష్టం చేసిందనే విశ్లేషణలు ఉన్నాయి.