ముంబై, సెప్టెంబర్ 29: కార్పొరేట్ కంపెనీల్లో ఎదురవుతున్న పని పరిస్థితులు ఎంతోమంది ఉద్యోగుల జీవితాల్ని చిత్తు చేస్తున్నాయి. తాజాగా నాగ్‌పూర్‌లో ప్రఖ్యాత ఐటీ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు. అతడికి భార్య, ఆరేండ్ల కుమారుడు ఉన్నారు. వాష్‌రూమ్‌కు వెళ్లిన అతడికి హఠాత్తుగా గుండెపోటు రావటంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడని ఐటీ సంస్థ అధికారులు ఆదివారం తెలిపారు.
ఈ ఘటన శుక్రవారం రాత్రి 7 గంటలకు జరిగిందన్నారు. మృతుడు నితిన్ ఎడ్విన్ మైఖేల్ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో ఓ సీనియర్ ఎనలిస్ట్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు చెప్పారు. నాగ్‌పూర్ సిటీ మిహాన్ ప్రాంతంలోని హెచ్‌సీఎల్ కార్యాలయంలోని వాష్‌రూమ్‌లో అపస్మారక స్థితిలో పడివుండగా, సహచర ఉద్యోగులు గుర్తించి దవాఖానకు తరలించారని, అయితే అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించినట్టు చెప్పారు.