Border Tension | భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత అంతర్జాతీయ సరిహద్దులో పరిస్థితులు మరింత దిగజారాయి. పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బుధవారం రాత్రి 1:45 గంటల ప్రాంతంలో అమృత్‌సర్‌లోని మూడు చోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దాంతో ఒక్కసారిగా కలకలం రేగింది. జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకుని మొత్తం జిల్లాలో బ్లాక్అవుట్ విధించాయి. ప్రజలు అస్సలు భయపడవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. శ్రీగురు రామ్‌దాస్ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్‌ను పూర్తిగా ఖాళీ చేయించారు. అక్కడ కూడా బ్లాక్అవుట్ విధించారు.
అయితే, ఏవో పేలుడు శబ్దాలు వినిపించాయని.. కానీ ఇప్పటివరకు ఎలాంటి సంఘటన జరిగిందని సమాచారం అందలేదని పోలీస్ కమిషనర్ గురుప్రీత్ సింగ్ తెలిపారు. వైమానిక దళ విమానాలు తమ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాయి. విమానం టేకాఫ్ అయ్యే శబ్దం చాలా బిగ్గరగా వస్తున్నది. అది చాలా శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని అధికార వర్గాలు తెలిపాయి. సరిహద్దులో పెరుగుతున్న సైనిక కార్యకలాపాలతో ముందు జాగ్రత్తగా ప్రజలు తమ ఇండ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఫజిల్కా సరిహద్దు గ్రామాలైన ముహర్ జంషేర్, మాన్సా నివాసితులు తమ పశువులు, నిత్యావసర వస్తువులు, ఇతర సామగ్రితో వెళ్లిపోతున్నారు.
జిల్లా యంత్రాంగం గ్రామాన్ని ఖాళీ చేయమని అధికారిక ఉత్తర్వులు జారీ చేయనప్పటికీ, ప్రజలు స్వయంగా ముందుజాగ్రత్తగా గ్రామాలను ఖాళీ చేస్తున్నారు. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వస్తున్నది. భారత సైన్యం ధీటుగా బదులిస్తున్నారు. దాంతో భయానక వాతావరణం ఏర్పడిందని స్థానికులు పేర్కొంటున్నారు. రాత్రిపూట సరిహద్దులో అనుమానాస్పద కదలికలు కనిపిస్తున్నాయని కొందరు గ్రామస్తులు తెలిపారు. మరోవైపు, ఫజిల్కా జిల్లా యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ప్రజలు ఊహాగానాలను పట్టించుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు.