న్యూఢిల్లీ: ఢిల్లీలో జెన్-జీ జూలైలో చేపట్టిన నిరసనలపై పోలీసుల స్పందనను డాక్యుమెంట్ చేస్తూ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక డిజిటల్ విచారణ నివేదికను ప్రచురించింది. ఆగస్టు 24న ప్రచురించిన ఈ విచారణ నివేదికలో.. భారత పోలీసులు శాంతియుత నిరసనకారులపై చట్టవిరుద్ధమైన, ప్రాణాంతకమైన బలాన్ని ప్రయోగించారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ‘ఎవిడెన్స్ ల్యాబ్’ వీడియో, ఫొటో ఆధారాలను పరిశీలించి ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఢిల్లీ, బిహార్లోని సీవాస్లో నిరసనకారులపై పోలీసులు పెల్లెట్ గన్స్, టియర్ గ్యాస్, గ్రెనేడ్లు, లాఠీలు, ఎలక్ట్రిక్ షాక్ పరికరాలు వంటి ఆయుధాలను ఉపయోగించినట్టు స్పష్టం చేసింది.
బలప్రయోగం ద్వారా నిరసనలను అణచివేయడానికి భారత అధికారులు యత్నించారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా బోర్డు చైర్పర్సన్ ఆకార్ పటేల్ ఆరోపించారు. ఈ రకమైన తీవ్రమైన స్పందన అనేది శాంతిభద్రతల నియంత్రణ ముసుగులో ప్రభుత్వం చేసిన హింసగా తెలిపారు. నెలరోజులు గడిచినా ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడమే దీనికి నిదర్శనం అని ఆయన అన్నారు. పెల్లెట్ గాయాలపాలైన ఒక నిరసనకారుడు మాట్లాడుతూ.. ఆర్ఏఎఫ్ సిబ్బంది మొదట టియర్ గ్యాస్ ఉపయోగించారని, తర్వాత పెల్లెట్ తుపాకులను ప్రయోగించారని ఆరోపించాడు.
అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా వెనుకభాగంలో గుండ్లు దిగాయని, దాదాపు 25 నుంచి 30 పెల్లెట్ గాయాలయ్యాయని పేర్కొన్నాడు. ఆ గాయాలు పెల్లెట్ల వల్లే అయ్యాయని హాస్పిటల్లోని వైద్యులు ధ్రువీకరించారని తెలిపాడు. ఢిల్లీ పోలీస్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది నిరసనకారులను లాఠీలతో కొడుతున్న ఎనిమిది వీడియోలను కూడా అమ్నెస్టీ ధ్రువీకరించింది. ప్రత్యక్షంగా ఎలాంటి ముప్పు కలిగించనివారిని, ఒక చిన్న బాలుడిని అధికారులు కొడుతున్న దృశ్యాలు ఆ ఫుటేజీలో ఉన్నాయి. కొన్ని వీడియోలలో సాధారణ దుస్తులతో ఉన్న వ్యక్తులు నిరసనకారులను లాఠీలతో కొడుతూ కనిపించారు. ఈ ఆధారాలు నిరసనకారులపై బలప్రయోగం, పోలీసు చర్యలకు జవాబుదారీతనం లేకపోవడంపై మళ్లీ ప్రశ్నలను రేకెత్తించాయి.