Amit Shah | పహల్గాంలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు. దాడికి కారణమైన ఎవరినీ వదిలిపెట్టమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులకు కేంద్రమంత్రి నివాళులర్పించారు. దేశ రాజధాని ఢిల్లీలో బోడో సామాజికవేత్త ఉపేంద్రనాథ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1990 నుంచి కశ్మీర్లో ఉగ్రవాదాన్ని నడుపుతున్న వారిపై ప్రధాని మోదీ జీరో టాలరెన్స్ పాలసీని అవలంభించారన్నారు. ప్రభుత్వం వారిపై బలంగా పోరాడుతుందన్నారు. మన పౌరుల ప్రాణాలు బలిగొని ఉగ్రవాదులు యుద్ధంలో విజయం సాధించామనుకుంటే పొరపాటేనన్నారు. ఉగ్రవాదం నిర్మూలించే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఇది మోదీ సర్కార్ అనీ.. ఎవరినీ వదిలిపెట్టదని హెచ్చరించారు. ఈ దుశ్చర్యకు పాల్పడ్డ వారికి తప్పనిసరిగా శిక్ష పడుతుందన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అది ఈశాన్య ప్రాంతమైనా.. వామపక్ష తీవ్రవాదం ఉన్న ప్రాంతం అయినా, కశ్మీర్‌పై ఉగ్రవాద నీడ అయినా ప్రభుత్వం అందరికీ బలమైన సమాధానం ఇస్తుందన్నారు. ఎవరినీ వదిలిపెట్టబోమని.. దేశంలోని ప్రతి అంగుళం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని సంకల్పించినట్లు పేర్కొన్నారు. ఈ పోరాటంలో 140 మంది భారతీయులే కాకుండా ప్రపంచం మొత్తం భారత్‌లో నిలుస్తుందన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ప్రపంచంలోని అన్ని దేశాలు ఐక్యంగా ఉన్నాయన్నారు. ఉపేంద్రనాథ్ విగ్రహం ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. బోడో సామాజిక వర్గానికి మాత్రమే కాకుండా వారి భాష, సంస్కృతి, అభివృద్ధి కోసం పోరాడిన చిన్న తెగులకు ఈ విగ్రహం కీలకమైందన్నారు. బోడోఫా విగ్రహం బోడో సమాజంపై మాత్రమే కాకుండా అన్ని చిన్న తెగలపై కూడా గౌరవాన్ని పెంచుతుందన్నారు.