Amit Shah : ఇటీవల బీహార్ ప్రభుత్వం (Bihar govt) మహిళల ఖాతాల్లో జమచేసిన పదేసి వేల రూపాయలను తిరిగి తీసుకోవాలని ఆర్జేడీ నేతలు (RJD leaders) ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడాన్ని కేంద్ర హోంమంత్రి (Union Home minister) అమిత్ షా (Amit Shah) తప్పుబట్టారు. మహిళల సొమ్మును ఆర్జేడీ నేతలు దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. లాలూ యాదవ్ తాతలు దిగొచ్చినా ఆ సొమ్మును దోచుకోలేరని వ్యాఖ్యానించారు.
బీహార్‌లో జంగిల్‌రాజ్ తిరిగి రావద్దంటే మళ్లీ ఎన్డీయే కూటమినే గెలిపించాలని అమిత్ షా ఓటర్లను కోరారు. దర్భాంగాలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ, నితీష్ అభివృద్ధి మోడల్‌కు, ఆర్జేడీ జంగిల్‌రాజ్‌కు మధ్య పోటీ జరుగుతోందని అన్నారు. మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం బీహార్‌ను సమగ్ర అభివృద్ధి వైపు నడిపిస్తుందని చెప్పారు.
బీహార్‌లో ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తే ‘మిథిలాంచల్’కు సాగునీరు అందించడానికి, ఆ ప్రాంతంలో వరదలను అరికట్టడానికి, కోషి నది నీటిని ఉపయోగించుకోవడానికి మొత్తం రూ.26 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని అన్నారు.