లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కాషాయ పార్టీ ఓటర్లపై వరాలు గుప్పిస్తోంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపడతారని బీజేపీని అధికారంలోకి తీసుకువస్తే అదే నెల 18న ఉచిత గ్యాస్ సిలిండర్లు మీ ఇంటికి చేరుకుంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇక రాబోయే ఐదేండ్లలో రైతులెవరూ విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండదని ఆయన హామీ ఇచ్చారు. యూపీలోని దిబియపూర్లో మంగళవారం జరిగిన ప్రచార ర్యాలీలో అమిత్ షా తమ హామీలను ఓటర్లకు గుర్తు చేశారు. యూపీలో మరోసారి యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోని కాషాయ సర్కార్‌కు పట్టం కట్టాలని ఆయన అభ్యర్ధించారు. ఈనెల 18న హోళీ రోజు యూపీ ప్రజలు కాషాయ పార్టీ విజయంతో సంబరాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్పై సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) చీఫ్ ఓం ప్రకాష్ రాజ్‌భర్ నిప్పులు చెరిగారు. వారణాసిలోని శివపూర్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్ధి అరవింద్ రాజ్‌భర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న తనపై దాడికి దిగారని ఆయన ఆరోపించారు. తనను అంతమొందించేందుకు యోగి ప్రయత్నిస్తున్నారని, నల్ల కోట్లు ధరించిన బీజేపీ, యోగి గూండాలు అక్కడకు చేరుకుని దాడికి తెగబడ్డారని ఆయన ఆరోపించారు. ఇక నిఘోహీ పోలీసు స్టేషన్ పరిధిలోని విక్రమ్‌పూర్ చకోరా గ్రామంలో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడిని హత్య చేశారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మృతుడిని సమాజ్‌వాదీ పార్టీకి చెందిన బూత్ ప్రెసిడెంట్ సుధీర్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రుడు సుధీర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ నేత హత్య ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది మరోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని కాషాయ పార్టీ శ్రమిస్తుండగా, యోగి సర్కార్‌పై వ్యతిరేకతతో అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని ఎస్పీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక కాంగ్రెస్, బీఎస్పీలు సైతం ప్రధాన పార్టీలకు దీటైన పోటీ ఇచ్చి సత్తా చాటేందుకు పావులు కదుపుతున్నాయి.