విజయవాడ, జూన్ 12: తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసైపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తున్న వీడియో వైరల్గా మారింది. బుధవారం విజయవాడలో జరిగిన ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి అమిత్ షా హాజరయ్యారు. అక్కడే ఉన్న తమిళిసై ఆయన వద్దకు వెళ్లి నమస్కరించి వెళ్లిపోతుండగా.. అమిత్ షా ఆమెను వెనక్కు పిలిచి మాట్లాడారు. ఈ సమయంలో అమిత్ షా ముఖంలో ఆగ్రహం స్పష్టంగా కనిపించింది. ఆయన వేలు చూపించి మరీ ఆమెను ఏదో విషయంలో మందలిస్తున్నట్టుగా వీడియోలో కనిపించింది.
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైతో తమిళిసైకి విభేదాలు తీవ్రం కావడం వల్లే ఆమెను అమిత్ షా మందలించారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించకపోవడంతోఅన్నామలై, తమిళిసై వర్గాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. అన్నామలై తీరుతోనే పార్టీ ఓడిపోయిందని, అన్నాడీఎంకేతో పొత్తు తెంచుకోవడానికి ఆయనే కారణమనే విమర్శలు మొదలయ్యాయి. ఎన్నికల్లో ఓటమిపై ఇరు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.
తమిళిసైతో అమిత్ షా మాట్లాడుతున్న వీడియోపై డీఎంకే అధికార ప్రతినిధి అన్నాదురై స్పందించారు. ‘ఇవి ఏ రకమైన రాజకీయాలు ? తమిళనాడుకు చెందిన ప్రముఖ మహిళా నాయకురాలిని బాహాటంగా మందలించడం మర్యాదేనా ? ఇది అందరూ చూస్తున్నారని అమిత్ షా తెలుసుకోవాలి. ఇది చాలా తప్పు’ అంటూ ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు.