Amit Shah | న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: పహల్గాం ఉగ్ర దాడిలో భద్రతా లోపాలు ఉన్న మాట నిజమేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఒప్పుకున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. ‘తప్పు జరగకపోయి ఉంటే మనం ఇక్కడ ఎందుకు కూర్చుంటాము? ఎక్కడో కొన్ని లోపాలు జరిగాయి. అవి ఏమిటో మనం కనిపెట్టాల్సి ఉంది’ అని సమావేశంలో ప్రతిపక్ష నాయకుల వద్ద అమిత్ షా వ్యాఖ్యానించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. పహల్గాం ఉగ్రదాడిపై గురువారం నాడిక్కడ ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించింది. భద్రతా వైఫల్యాల గురించి ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీసినట్లు తెలుస్తోంది.
‘భద్రతా దళాలు ఎక్కడున్నాయి? సీఆర్పీఎఫ్ ఎక్కడ ఉంది?’ అని పలువురు నాయకులు ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జూన్లో అమర్నాథ్ ప్రారంభమయ్యే వరకు సాధారణంగా ఎవరికీ ప్రవేశం ఉండని బైసరాన్ ప్రాంతాన్ని తెరచిన సంగతి స్థానిక అధికారులు భద్రతా దళాలకు ముందుగా తెలియచేయలేదని ప్రభుత్వం జవాబిచ్చినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన తర్వాత స్పందించడంలో జరిగిన జాప్యంపై కూడా ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయని ఆ వర్గాలు తెలిపాయి. దీనికి అధికారులు వివరణ ఇస్తూ బైసారన్ ప్రాంతానికి చేరుకోవాలంటే పర్వత మార్గంలో45 నిమిషాలు ప్రయాణించాల్సి ఉంటుందని, ఇటువంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనడానికి తమకు స్పష్టమైన నియమ నిబంధనలు ఏమీ లేవని తెలియచేశారు.
ఉగ్రవాద సమస్యను ఎదుర్కోవడంలో సంపూర్ణ సహకారం అందజేస్తామని ప్రభుత్వానికి ప్రతిపక్షాలు హామీ ఇచ్చాయి. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని పార్టీలకు అతీతంగా ఎంపీలు అందరూ ప్రభుత్వాన్ని కోరారు. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని అఖిలపక్ష సమావేశంలో కేంద్రం హామీ ఇచ్చింది. జమ్ముకశ్మీర్ ఆర్థిక వ్యవస్థ పుంజుకుని, పర్యాటకం వృద్ధి చెందుతున్న సమయంలో ఈ ఉగ్రదాడి జరిగిందని కేంద్ర మంత్రి రిజిజు తెలిపారు.