Tamil Nadu : త్వరలోనే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు పొత్తులు, సీట్ల కోసం అప్పుడే కసరత్తు ప్రారంభించాయి. ఈ అంశంపై బీజేపీ-ఏఐఏడీఎంకే మధ్య ఒక అవగాహన కుదిరిందని తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా, ఏఐఏడీఎంకే కీలక నేత పళనిస్వామి మధ్య సీట్ల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలనే నిర్ణయానికొచ్చాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో బీజేపీ బలహీనంగా ఉన్న సంగతి తెలిసిందే. అందుకే అసెంబ్లీకి పోటీ చేయబోయే సీట్లు, మంత్రి పదవుల విషయంలో అమిత్ షా ఆచితూచి అడుగులేస్తున్నారు. అక్కడ మొత్తం 234 అసెంబ్లీ సీట్లకుగాను, 56 సీట్లు కావాలని అమిత్ షా.. పళనిస్వామిని అడిగారు. ఒకవేళ అక్కడ ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే.. మూడు క్యాబినెట్ మంత్రి పదవులు కూడా బీజేపీకి కావాలని అడిగారు. అలాగే పార్టీ తిరుగుబాటు నేతలు పనీర్ సెల్వం, దినకరన్ కు కూడా సీట్లు అడిగినట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఎన్డీయే కూటమిలోనే ఇతర పార్టీలకు సీట్ల కేటాయింపుపైనా చర్చించారు.
వీటన్నింటిపై పళనిస్వామి ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రచారం జరుగుతోంది. పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతానని ఆయన అమిత్ షాకు చెప్పారు. అయితే, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తమ పార్టీకి ఇబ్బంది తప్పదని ఏఐఏడీఎంకే నేతలు భావిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కంట్రోల్ అంతా బీజేపీ చేతుల్లోకి వెళ్తుందని అధికార డీఎంకే విమర్శిస్తున్న విషయాన్ని పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. మరోవైపు ఎన్డీయే కూటమిలోకి నటుడు విజయ్ స్థాపించిన టీవీకే కూడా చేరే అవకాశం ఉందనే ఇంకో ప్రచారం కూడా జరుగుతోంది. వచ్చే వేసవిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో తెలుస్తుంది.