Amit Shah : దేశంలో జనాభాలో వస్తున్న అనవసర మార్పులు, అక్రమ వలసలపై అధ్యయనం చేసేందుకు ఒక హైలెవల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ అంశంపై ఎక్స్ వేదికగా మంగళవారం అమిత్ షా స్పందించారు.
గత ఏడాది ఆగష్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అమిత్ షా వెల్లడించిన వివరాల ప్రకారం.. రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నోలేకర్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఈ కమిటీలో జనాభా లెక్కల కమిషనర్, రిటైర్డ్ ఐఏఎస్ దుర్గా శంకర్ మిశ్రా, రిటైర్డ్ ఐపీఎస్ బాలాజీ శ్రీవాస్తవ, ప్రముఖ ఆర్థిక వేత్త డా.షామికా రవి సభ్యులుగా ఉంటారు. హోం అఫైర్స్ మంత్రిత్వ శాఖకు చెందిన జాయింట్ సెక్రెటరీ కూడా ఇందులో సెక్రెటరీ మెంబర్గా వ్యవహరిస్తారు. జనాభాలో కలుగుతున్న అనియంత్రిత మార్పులు జాతీయ సమగ్రతకు, భద్రతకు, శాంతి భద్రతలకు, ఆదిమ తెగ సమాజానికి ముప్పుగా మారాయని అమిత్ షా భావిస్తున్నారు.
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జనాభా వేగంగా పెరగడం, అక్రమ వలసలు, ఇతర అసహజ కారణాలను ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. మతపరంగా, సామాజిక వర్గాల పరంగా జనాభా ఎలా పెరుగుతుందో ఈ కమిటీ అంచనా వేయనుంది. దీనికి తగిన పరిష్కారాల్ని కూడా కమిటీ సూచించనుంది. అక్రమ వలసలు దేశ సమగ్రతకు ముప్పుగా మారాయని బీజేపీ ఎప్పటినుంచో చెబుతోంది. ఈ నేపథ్యంలో వీటిని అరికట్టేందు కూడా ఈ కమిటీ ఉపయోగపడనుంది.