Amit Malviya : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నంతో పోలిక తీసుకొస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లక్ష్యంగా బీజేపీ నేత అమిత్ మాల్వియ విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీపై హింసకు రాహుల్ గాంధీ ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీపై దాడిని ప్రేరేపించేలా, హింసను సమర్ధించేలా పలుమార్లు రాహుల్ గాంధీ ప్రధానికి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు.
2022లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా వైఫల్యాన్ని ఈ సందర్భంగా అమిత్ మాల్వియ ప్రస్తావించారు. ఉద్దేశపూర్వకంగానే నాటి పంజాబ్ ప్రభుత్వం ప్రధాని భద్రతపై రాజీపడిందని చెప్పుకొచ్చారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యా యత్నాన్ని అంతకుముందు రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ఖండించారు. ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిందని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) ప్రకటించింది. దుండగుడు కాల్పులు జరిపిన ప్రాంతాన్ని ఇంకా అనుమానిత స్థలంగానే పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఈ సాయంత్రం పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై హత్యాయత్నం జరిగినట్లు ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్ కెవిన్ రొజెక్ అన్నారు. దుండగుడు కాల్పులు జరిపిన ప్రదేశంలో కొన్ని అనుమానిత ప్యాకేజీలను గుర్తించినట్లు వెల్లడించారు. అవన్నీ పేలుడు పదార్థాలుగానే తాము భావిస్తున్నామన్నారు.
Read More :
Seetakka | మీరు ఎంత గగ్గోలు పెట్టినా పరీక్షలు వాయిదా వేయం : మంత్రి సీతక్క