Muda chief | కర్ణాటకలో ముడా కేసు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ముడా’లో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ముడా చీఫ్ (Muda chief) కె.మరిగౌడ (K Marigowda ) తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాలు చూపుతూ ముడా చీఫ్ పదవికి బుధవారం రాజీనామా చేశారు.
మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) భూకుంభకోణం ఆరోపణలు కర్ణాటకలో గత కొన్ని నెలలుగా ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అడ్డంగా బుక్కయ్యారు. ముడా నుంచి తన భార్యకు అనుచితంగా లబ్ధి కలిగించినట్లు సీఎంపై ఆరోపణలున్నాయి. దీంతో కుంభకోణం వ్యవహారంలో సిద్ధరామయ్యపై లోకాయుక్త పోలీసులు, ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ వివాదం నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి కేటాయించిన 14 స్థలాలను ముడా అధికారులు ఇటీవలే వెనక్కి కూడా తీసుకున్నారు. ముడా కుంభకోణం నేపథ్యంలో, తనకు కేటాయించిన భూములను తిరిగి వెనక్కి తీసుకోవాలని సీఎం భార్య మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా)కి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ 14 ప్లాట్లను వెనక్కి తీసుకుంటూ సేల్డీడ్ను రద్దు చేయాలని ముడా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ కుంభకోణం వ్యవహారంలో సిద్ధరామయ్యపై విచారణ కొనసాగుతోంది.
ఇక ముడా కుంభకోణంలో పీకల్లోతు కూరుకుపోయి విచారణను ఎదుర్కొంటున్న సీఎం సిద్ధరామయ్య ఏ క్షణంలోనైనా పదవిని కోల్పోతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే ఆయన సన్నిహితుడుగా భావిస్తున్న ముడా చీఫ్ రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Also Read..
Priyanka Gandhi | వయనాడ్లో వెలిసిన ప్రియాంక గాంధీ పోస్టర్లు
Chennai Rain | నీట మునిగిన చెన్నై.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ