తెలంగాణకు చెందిన వెంకట్ ఆరేండ్ల కిందట ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. హెచ్1బీ వీసా రావడం, అమెరికాలో ఎమ్మెస్ పూర్తి చేయడంతో ఓ పెద్ద టెక్ కంపెనీలో అతనికి మంచి ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. అయితే, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆ కంపెనీ అతన్ని ఏడాదిన్నర పూర్తి కాకుండానే తొలగించింది. ఎక్కడా ఉద్యోగం దొరక్కపోవడంతో న్యూజెర్సీలోని ఓ రెస్టారెంట్లో అతడు ఏడాది పాటు వెయిటర్‌గా పని చేయాల్సి వచ్చింది.
వరంగల్‌కు చెందిన అజయ్ హైదరాబాద్‌లోని ఓ దిగ్గజ కంపెనీలో ఐదేండ్లు పనిచేసి అమెరికా వెళ్లాడు. అక్కడే ఎమ్మెస్ పూర్తి చేశాడు. పని అనుభవం, ఉన్నత చదువు ఉన్నప్పటికీ ఇంకా అతనికి ఉద్యోగం రాలేదు. ఎన్ని కంపెనీలకు దరఖాస్తు చేసినా ఇంటర్వ్యు పిలుపు రానే రావట్లేదు. హైదరాబాద్‌లో రూ.40 లక్షల ప్యాకేజీని కాదనుకొని అమెరికాకు వెళ్లిన మరో విద్యార్థికి ఇప్పటికీ అక్కడ ఉద్యోగం దొరకలేదు. దీంతో పెట్రోల్ బంకులో పని చేయాల్సి వచ్చింది.
భారతీయ విద్యార్థుల డాలర్ డ్రీమ్స్ కనుమరుగవుతున్నాయి. అమెరికా వెళ్లాలి.. చేతి నిండా డాలర్లు సంపాదించాలి. ఉన్నత స్థానానికి చేరుకోవాలి అనుకునే సగటు భారతీయుడి ఆశలపై అక్కడి తాజా పరిస్థితులు నీళ్లు చల్లుతున్నాయి.
Indian Students | హైదరాబాద్, సెప్టెంబర్ 25 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): గడిచిన రెండున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా అమెరికా జాబ్ మార్కెట్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఉపాధి కోసం అమెరికా వెళ్దామనుకునేవారి సంగతి అటుంచితే.. ఎప్పుడు తమ ఉద్యోగాలు ఊడుతాయో అని అమెరికాలోని భారతీయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఉద్యోగ భయం వారిని వెంటాడుతున్నది. దీంతో అక్కడే ఉండాలా.. స్వదేశానికి తిరిగి రావాలా అని అలోచనలో పడ్డారు.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మాంద్యం భయాలు, కంపెనీలకు వస్తున్న ప్రాజెక్టుల్లో క్షీణత, రానున్న అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ వెరసి అమెరికాలోని పలు కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు చెప్తున్నాయి. అమెజాన్, మెటా, సేల్స్‌ఫోర్స్, ఎక్స్, ఉబర్ వంటి దిగ్గజ సంస్థలు సైతం ఉద్యోగాలకు కోత పెడుతున్నాయి. ఇలా జాబ్‌లు కోల్పోయిన వారిలో చాలామంది కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడం కష్టంగా మారింది.
లేఆఫ్‌లు మరింతగా పెరుగుతుండటంతో హెచ్1బీలకు సైతం ఉద్యోగాలు దొరక్కపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొవిడ్ అనంతర కాలంలో కూడా పారిశ్రామిక రంగం పెద్దగా పుంజుకోలేదు. దీనికితోడు అమెరికా ప్రభుత్వం ప్యాకేజీలను ఆపేసింది. లాక్డౌన్ సమయంలో వివిధ సంస్థలు, వ్యక్తులకు ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు కాకపోవడంతో బ్యాంకులు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. ఫలితంగా కొత్త రుణాలివ్వడం నిలిపేశాయి. దీని ప్రభావం పారిశ్రామిక రంగంపై పడింది. వెరసి ఇది అగ్రరాజ్యంలో ఉద్యోగాల కోతకు దారి తీస్తున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెరికాలో ఉద్యోగాన్ని కోల్పోతే 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. లేదంటే దేశాన్ని వీడక తప్పదు. ఇక, అగ్రరాజ్యంలో ఎమ్మెస్ పూర్తి చేసిన వెంటనే సంబంధిత యూనివర్సిటీ విద్యార్థి పేరిట ఓపీటీ ఐ20 (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్)ని విడుదల చేస్తుంది. దీని ద్వారా మూడు నెలల్లో ఏదో ఒక ఉద్యోగం చేయాలి. లేదంటే ఆ దేశాన్ని విడిచిపెట్టాలి. దీంతో దేశాన్ని వీడాల్సి వస్తుందన్న భయంతో కన్సల్టెన్సీల సాయంతో ఏదో ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరినట్టు ధ్రువీకరణ పత్రాలు తీసుకొంటున్నారు.
పొట్టకూటి కోసం తక్కువ జీతానికి రెస్టారెంట్లు, పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్నారు. ఉన్నత చదువుల కోసం తీసుకొన్న ఎడ్యుకేషన్ లోన్ ఎలా తీర్చాలని మరికొందరు భయపడుతున్నారు. తన తండ్రి సుమారు 40 లక్షలు అప్పు చేసి తనను అమెరికా పంపాడని, ఇప్పుడు చదువు పూర్తయినా ఉద్యోగం దొరక్క పార్ట్‌టైం జాబ్ చేస్తున్నానని, ఉద్యోగం దొరికే ఆశ కనుచూపు మేర కన్పించడం లేదని, ఏం చేయాలో అర్ధం కావడం లేదని తెలంగాణ నుంచి యూఎస్ వెళ్లిన ఒక విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు.
లే ఆఫ్-ఫై వెబ్సైట్ ప్రకారం నిరుడు ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగులు కోల్పోయిన మొత్తం ఉద్యోగాల్లో 70 శాతం వాటా అమెరికాదేనని తేలింది. ఎడ్టెక్, ఫుడ్, ఆర్థికం, రిటైల్, కన్జ్యూమర్, ఆరోగ్య రక్షణ రంగాలకు చెందిన 7,21,677 మంది ఉద్యోగాలకు దూరమైనట్టు గణాంకాలు చెప్తున్నాయి. అమెరికాలో ఏడాది వ్యవధిలో ఉద్యోగాల తొలగింపులు 98 శాతం పెరిగాయని ఛాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. అమెజాన్, మెటా వంటి టెక్ కంపెనీలే గత ఏడాది 1.68 లక్షల మందికి ఉద్వాసన పలికాయని పేర్కొన్నది. ఈ ఏడాది పరిస్థితులు మరింత అధ్వాన్నంగా ఉండనున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఒక్క అమెరికాలోనే కాదు జర్మనీ, స్వీడన్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల్లోనూ ఉద్యోగ సంక్షోభం ఉన్నదని లేఆఫ్-ఫై వెబ్సైట్ సహా మరో రెండు సంస్థల నివేదికలు వెల్లడించాయి. ప్రపంచంలోని ప్రతి పది ఉద్యోగ కోతల్లో మూడు ఉద్యోగాల ఊస్టింగ్ ఈ దేశాల్లోనే జరుగుతున్నట్టు వివరించాయి.
అమెరికాలో 30 ఏండ్లుగా ఉంటున్నా. గడిచిన 28 ఏండ్లలో ఇలాంటి ఉద్యోగ సంక్షోభం ఎన్నడూ చూడలేదు. 14 ఏండ్ల పని అనుభవం ఉన్నవారికి కూడా ఇప్పుడు ఉద్యోగం దొరకట్లే. ఈ పరిస్థితి ఐటీలో మరింత ఎక్కువగా ఉన్నది.
– ఐతరాజు శ్రీకాంత్, అమెరికాలో ఓ కన్సల్టెన్సీ నిర్వాహకుడు.