Indian Immigrants | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: డాలర్ డ్రీమ్స్ చెదిరాయి.. లక్షల డాలర్లు సంపాదించాలనుకున్న కలలు కల్లలయ్యాయి. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా అగ్రరాజ్యంలోకి తాము సాగించిన జీవన పోరాటం తీవ్ర ఖేదాన్ని మిగిల్చింది. కరడుగట్టిన ఖైదీలకు వేసినట్టుగా కాళ్లు, చేతులకు బేడీలతో అవమానకర రీతిలో మాతృగడ్డపైకి పంపడం మరింత కుంగదీసింది. అమెరికా బహిష్కరించి బలవంతంగా సైనిక విమానంలో పంపేయడంతో బుధవారం అమృత్‌సర్‌కు చేరుకున్న 104 మంది భారతీయుల ముఖాల్లో తీవ్ర ఆవేదన, భవిష్యత్తుపై బెంగ కన్పించింది.
యూఎస్-మెక్సికో సరిహద్దులో చీకటి గదుల్లో తాము అనుభవించిన నరకాన్ని తలచుకుని కొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. పంజాబ్‌లోని హోషియాపూర్ జిల్లా తాహిల్ గ్రామానికి చెందిన హర్వీందర్ సింగ్ మాట్లాడుతూ యూఎస్‌లో వర్క్ వీసా ఇప్పిస్తానని చెప్పిన ఒక ఏజెంట్‌ను నమ్మి రూ.42 లక్షలు చెల్లించానని చెప్పాడు. అయితే ఆఖరి నిమిషంలో తనకు వీసా రాలేదని చెప్పారని, అయితే ఎలాగైనా అమెరికా చేరుస్తామని చెప్పి తొలుత ఢిల్లీ నుంచి ఖతార్‌కు, అక్కడి నుంచి బ్రెజిల్‌కు తీసుకు వెళ్లారన్నారు. టాక్సీలు తమను కొలంబియాకు తీసుకువెళ్లాయని, అక్కడి నుంచి పనామాకు వెళ్లామన్నారు. సముద్రంపై చిన్న బోటులో నాలుగు గంటల పాటు ప్రయాణం సాగిన తర్వాత పడవ బోల్తా పడగా, తమతో ఉన్న ఒక వ్యక్తి మరణించారని తెలిపారు. మరో వ్యక్తి పనామా అడవిలో కన్నుమూశాడన్నారు. అంతకాలం తాము కొద్దిపాటి బియ్యం తిని బతికామని వెల్లడించాడు.
దారాపూర్ గ్రామానికి చెందిన సుఖ్‌పాల్ సింగ్ కూడా ఇదే తరహా అనుభవాన్ని వెల్లడించాడు. చిన్న పడవలో 15 గంటల పాటు సముద్ర ప్రయాణం చేసిన తర్వాత, లోతైన ప్రమాదకరమైన కొండ లోయలలో 45 కి.మీ కాలినడకన బిక్కుబిక్కుమంటూ వెళ్లినట్టు తెలిపాడు. ఈ క్రమంలో ఎవరైనా గాయపడితే వారిని అలాగే వదిలేసేవారని, ఇంత కష్టపడి ప్రయాణం చేసినా యూఎస్‌లోని ప్రవేశించడానికి సరిహద్దును దాటడానికి ముందు తనను పోలీసులు మెక్సికోలో అరెస్ట్ చేశారన్నారు. 14 రోజుల పాటు తమను చీకటి కొట్టాల్లాంటి సెల్లో బంధించారని, జీవితంలో తిరిగి సూర్యుడి వెలుగును చూస్తానని అనుకోలేదని తెలిపాడు.అమెరికా వెళ్లేవారు దయుంచి తనలా అక్రమ మార్గాల్లో వెళ్లవద్దని సుఖ్‌పాల్ సింగ్ విజ్ఞప్తి చేశారు.
కపుర్తలాలోని బెహబాయి బహాడేకు చెందిన గురుప్రీత్ సింగ్ తమ ఇంటిని తాకట్టు పెట్టి అప్పు చేసి అమెరికా వెళ్లాడు. అలాగే జస్వీందర్ సింగ్ కుటుంబ సభ్యులు అతడిని పంపడానికి 50 లక్షలు ఖర్చు చేశారు.