న్యూఢిల్లీ, జూలై 6: బొగ్గు, సహజ వాయువు, చమురు అధిక వినియోగం వాతావరణ మార్పులకు కారణమవుతున్నది. ఫలితంగా భూతాపం పెరిగి జనం అల్లాడిపోతున్నారు. వరుసగా మూడో రోజు బుధవారం కూడా ప్రపంచ ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 17.18 సెల్సియస్ (62.9 డిగ్రీల ఫారెన్‌హీట్) కాగా, మంగళవారం రికార్డు స్థాయిలో 17.18 డిగ్రీలుగా రికార్డయింది. ఇక, మూడోరోజు బుధవారం అంతకుమించిన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మానవ తప్పిదాల కారణంగా భూమిని చల్లబరిచే లా నిను కాస్త తప్పుకుని ఎల్‌నినోకు చోటిస్తున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రపంచ ఉష్ణోగ్రతలు మరింత వేడెక్కడం ఖాయమని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాతావరణ శాస్త్రవేత్త క్రిస్ఫీల్డ్ తెలిపారు. రోజువారీ నమోదవుతున్న ఈ వివరాలు అధికారికం కాకపోయినా వేడెక్కుతున్న ప్రపంచంలో ఏం జరుగుతున్నదో చెప్పేందుకు పనికొస్తాయని యూనివర్సిటీ ఆఫ్ మెరైన్ ైక్లెమేట్ శాస్త్రవేత్త సీన్ బిర్క్లే పేర్కొన్నారు. అమెరికాలోని 38 మిలియన్ల మంది బుధవారం అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరయ్యారు.