PM Modi : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon).. భారత్‌లో తన వ్యాపార కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు సిద్ధమైంది. ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) తో కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ (Andy Jessy) సమావేశమైన అనంతరం ఈ కీలక ప్రకటన వెలువడింది. 2026 నుంచి 2030 మధ్య కాలంలో దేశంలో ఏకంగా 48 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.53 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ఈ పెట్టుబడులతో భారత మార్కెట్‌పై తమకున్న దీర్ఘకాలిక నిబద్ధతను కంపెనీ మరోసారి స్పష్టంచేసింది.
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను విస్తరించడానికి 2030 నాటికి అదనంగా 13 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఆండీ జెస్సీ తెలిపారు. దాంతో కేవలం ఏఐ, క్లౌడ్ రంగంలోనే అమెజాన్ మొత్తం పెట్టుబడి 21 బిలియన్ డాలర్లను దాటనుంది. ఈ పెట్టుబడుల ద్వారా ముంబై, హైదరాబాద్‌లలోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) డేటా సెంటర్ల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనున్నారు. ఇది స్టార్టప్‌లు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలకు కస్టమ్ ఏఐ చిప్స్, సురక్షిత క్లౌడ్ టెక్నాలజీలు, డెవలపర్ టూల్స్‌ను అందుబాటులోకి తెస్తుంది.
తద్వారా ఆవిష్కరణలను వేగవంతం చేయవచ్చని కంపెనీ పేర్కొన్నది. ఈ సమావేశం అనంతరం ఆండీ జెస్సీ మాట్లాడుతూ.. దశాబ్దం క్రితం భారత్‌లోకి అడుగుపెట్టామని, అప్పటి నుంచి ఈ-కామర్స్, ఏఐ, క్లౌడ్ వ్యాపారాల్లో అద్భుతమైన వృద్ధిని చూస్తున్నామని అన్నారు. ప్రధాని మోదీ దార్శనికత అయిన ‘వికసిత్ భారత్’, ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాల సాధనకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. భారత్ వృద్ధి ప్రస్థానంలో దీర్ఘకాలిక భాగస్వామిగా కొనసాగుతామని స్పష్టంచేశారు. ఈ కొత్త పెట్టుబడులతో కలిపి 2010 నుంచి 2030 వరకు భారత్‌లో అమెజాన్ పెట్టిన మొత్తం పెట్టుబడుల విలువ 88 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది.
గత కొన్నేళ్లుగా భారత్‌లో 12 మిలియన్ల చిన్న వ్యాపారాలను డిజిటలైజ్ చేశామని, 20 బిలియన్ డాలర్ల విలువైన ఈ-కామర్స్ ఎగుమతులను సాధ్యం చేశామని, ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.8 మిలియన్ల ఉద్యోగాలకు మద్దతు ఇచ్చామని అమెజాన్ కంపెనీ వివరించింది. అలాగే 10 మిలియన్ల భారతీయులకు క్లౌడ్ స్కిల్స్‌పై శిక్షణ ఇచ్చినట్లు తెలిపింది. భవిష్యత్తులోనూ భారత ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఏఐ ఆధారిత డిజిటలైజేషన్, ఎగుమతుల వృద్ధి, ఉద్యోగాల కల్పనపై దృష్టి సారిస్తామని అమెజాన్ పేర్కొన్నది.
రానున్న కాలంలో 3.8 మిలియన్ల ఉద్యోగాలకు మద్దతు ఇవ్వడం, 80 బిలియన్ డాలర్ల సంచిత ఎగుమతులు సాధించడం, 15 మిలియన్ల చిన్న వ్యాపారాలకు ఏఐ ప్రయోజనాలు అందించడం, 4 మిలియన్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ విద్యను అందించడం వంటి లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు అమెజాన్ వెల్లడించింది.