Amartya Sen : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)తో ముస్లింలకు అన్యాయం జరుగుతుందని, దీనివల్ల బీజేపీకే లాభం కలుగుతుందని నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ అన్నారు. శనివారం ఆయన ఒక మీడియా సంస్థతో మాట్లాడారు. ఈ సందర్భంగా సర్ చేపడుతున్న తీరును తప్పుబట్టారు. నకిలీ ఓట్లను తొలగించేందుకు, అర్హులైన ఓటర్లను గుర్తించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే (సర్) చేపట్టిన సంగతి తెలిసిందే.
దీనిలో భాగంగా ఓటర్లు తమకు సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించాలి. అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటేనే ఓటరుగా నమోదు చేస్తారు. లేకుంటే ఓట్లను తొలగిస్తారు. దొంగ ఓట్లను గుర్తించేందుకు ఈ పని చేస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతుంటే.. బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగించేందుకు ఈసీ ఈ పని చేస్తోందని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడు ‘సర్’ అంశంపై ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ స్పందించారు. ఆయనకు కూడా ఈసీ ఇటీవల ‘సర్’ గురించి నోటీసులు జారీ చేసింది. అంటే.. ఆయన వయసుకు, తన తల్లి వయసుకు మధ్య 15 ఏళ్లు మాత్రమే తేడా ఉండటంపై ఈసీ వివరణ కోరింది. ఇందుకు తగిన డాక్యుమెంట్లు సమర్పించాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే ‘సర్’పై అమర్త్య సేన్ స్పందించారు. ‘‘పశ్చిమ బెంగాల్ లో ‘సర్’ వేగంగా చేపట్టడం వల్ల ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉంది. ప్రజలు వేగంగా తగిన డాక్యుమెంట్లు సమర్పించాలని సూచించారు. ఇది అందరికీ వీలుకాదు.
చాలామంది దగ్గర డాక్యుమెంట్లు లేవు. గ్రామీణ ప్రాంతాల్లో నా దగ్గరే బర్త్ సర్టిఫికెట్ లేదు. డాక్యుమెంట్లు సమర్పించకపోతే ఓటు హక్కు కోల్పోతారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయలేరు. దీనివల్ల ముస్లింలు, ఇతర అణగారిన వర్గాలు అన్యాయానికి గురయ్యే అవకాశం ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ‘సర్’ ప్రక్రియ మంచిదే. కానీ, దీనికి తగినంత సమయం ఇవ్వాలి. వేగంగా ఈ ప్రక్రియ చేపట్టడం మంచిది కాదు’’ అని అమర్త్య సేన్ అన్నారు. మరోవైపు ఆయనకు ఈసీ నోటీసులు ఇవ్వడంపై పలు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నోబెల్ బహుమతి గ్రహీతను విచారణకు ఎలా పిలుస్తారని విమర్శించారు.